5 ఓవర్లలోనే మ్యాచ్‌ ఖతం.. ఆసియా క్రీడల్లో జపాన్‌పై భారత్‌ విధ్వంసం

5 ఓవర్లలోనే మ్యాచ్‌ ఖతం.. ఆసియా క్రీడల్లో జపాన్‌పై భారత్‌ విధ్వంసం

India Womens Cricket Team crushes Japan in 5 overs at Asian Games
  • భారత్‌కు 8 వికెట్ల ఘన విజయం
  • 58 పరుగులకే జపాన్‌ ఆలౌట్‌
  • 15 బంతుల్లో షెఫాలీ అజేయ 40
  • చరణికి నాలుగు వికెట్ల ఘనత
  • సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ పోరు
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే వేటను ఘనంగా ప్రారంభించింది. ఆతిథ్య జపాన్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత జపాన్‌ను 58 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. ఆ తర్వాత కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

భారత విజయంలో షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ కీలకంగా నిలిచింది. 15 బంతుల్లోనే అజేయంగా 40 పరుగులు చేసింది. నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్‌తో జపాన్‌ బౌలర్లను ఉతికారేసింది. గిరిజా కామలినితో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన షెఫాలీ తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదింది.

అయితే కామలిని రెండు బంతుల్లోనే డకౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత భారతి ఫుల్మాలి 6 పరుగులకే ఔటైంది. అయినా షెఫాలీ ఏమాత్రం తగ్గలేదు. ఐదో ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదిన ఆమె.. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించింది. రిచా ఘోష్‌ 6 బంతుల్లో 12 పరుగులు చేసింది.

అంతకుముందు భారత బౌలర్లు జపాన్‌ను 58 పరుగులకే పరిమితం చేశారు. ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ శ్రీ చరణి 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. షెఫాలీ రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్‌, దీప్తి శర్మ చెరో వికెట్‌ సాధించారు.

శ్రీలంకపై ఆసియా కప్‌ ఫైనల్లో 4/20తో రాణించిన చరణి.. జపాన్‌పైనా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో భారత్‌ అలవోకగా సెమీఫైనల్‌ చేరింది.

శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో పాకిస్థాన్‌, శ్రీలంక ఢీకొంటాయి.
Advertisement
India Womens Cricket Team
Shafali Verma
Asian Games Cricket
India vs Japan Women
Sri Charani
India vs Bangladesh Semi Final

More Telugu News