నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరైన కేటీఆర్
- ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్
- కోర్టుకు హాజరైన కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ మల్లేశ్వరరావు
- రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై ఏసీబీ అభ్యంతరాలు
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నమోదైన కేసు విచారణకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా న్యాయస్థానం ముందుకు వచ్చారు.
గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ కోసం హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై ఏసీబీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండా, ఆర్థిక నిబంధనలు, ప్రామాణిక విధివిధానాలను ఉల్లంఘించి ఈ నిధులను కేటాయించారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు, నిందితులకు ఇదివరకే సమన్లు జారీ చేసింది. గత విచారణ సమయంలో కేటీఆర్ వ్యక్తిగత కారణాల వల్ల మినహాయింపు కోరగా, విచారణ ఈనాటికి వాయిదా పడటంతో ఆయన ప్రత్యక్షంగా హాజరయ్యారు.