అమెరికాలో సిక్కు ట్రక్ డ్రైవర్‌పై కిరాతక దాడి.. 17 సార్లు కత్తితో పొడిచిన అపరిచిత వ్యక్తి
- అమెరికాలోని సౌత్ వైయోమింగ్ ఏరియాలో సిక్కు డ్రైవర్ పై దాడి
- మెడ, చాతీ, పక్కటెముకలపై 17 సార్లు కత్తితో పొడిచిన వైనం
- 45 ఏళ్ల క్రిస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలోని సౌత్ వైయోమింగ్ రెస్ట్ ఏరియాలో తీవ్ర దారుణం చోటుచేసుకుంది. పెన్సిల్వేనియా వైపు వెళ్తున్న ఓ సిక్కు ట్రక్ డ్రైవర్‌పై (సింగ్) అపరిచిత వ్యక్తి హఠాత్తుగా విరుచుకుపడి, కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగుడు, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడి చేసి మెడ, ఛాతీ, పక్కటెముకలపై ఏకంగా 17 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చి కుప్పకూలిన ఆయనను స్థానికంగా ఉన్న ఒక హిస్పానిక్ కుటుంబం సమయస్ఫూర్తితో స్పందించి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ దారుణ ఘటనపై స్పందించిన వైయోమింగ్ పోలీసులు 45 ఏళ్ల ఆండ్రూ క్రిస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, ఆయనపై ‘తొలి స్థాయి హత్యాయత్నం’ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యక్తిగత కక్షలా లేదా హేట్ క్రైమా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇటీవల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సోషల్ మీడియాలో "మిస్టర్ సింగ్.. మా రోడ్ల పైనుంచి వెళ్లిపోండి" అంటూ సిక్కు ట్రక్ డ్రైవర్లను ఉద్దేశించి పెట్టిన వివాదాస్పద పోస్ట్ కలకలం రేపిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఈ కిరాతక దాడిని భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. సిక్కు, దక్షిణాసియా అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ద్వేషపూరిత ప్రచారాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వ వర్గాలు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు.