యూట్యూబ్‌ చూసి శాండ్‌విచ్‌ నేర్చుకున్నాడు.. ఇప్పుడు నెలకు రూ.25 లక్షలు

యూట్యూబ్‌ చూసి శాండ్‌విచ్‌ నేర్చుకున్నాడు.. ఇప్పుడు నెలకు రూ.25 లక్షలు

Abhishek Sahu learned sandwich making from YouTube now earns 25 lakhs per month
  • ఇంటర్నెట్‌ కేఫ్‌ విఫలమైనా వెనక్కి తగ్గని అభిషేక్‌ అనే భోపాల్‌ యువకుడు
  • రూ.30 వేల అప్పుతో శాండ్‌విచ్‌ బండి ప్రారంభించిన వైనం
  • యూట్యూబ్‌ వీడియోలతో శాండ్‌విచ్‌ తయారీ నేర్చుకున్న అభిషేక్‌
  • ఇప్పుడు సాధారణ రోజుల్లో 600కుపైగా శాండ్‌విచ్‌ల విక్రయం
  • వైరల్‌ రీల్‌తో బండికి భారీగా గుర్తింపు
ఒకప్పుడు ఇంటర్నెట్‌ కేఫ్‌ పెట్టాడు. ఏడాది తిరగకముందే మూతపడింది. అయినా వెనక్కి తగ్గలేదు. చేతిలో పెద్దగా డబ్బు లేదు. ఫుడ్‌ బిజినెస్‌పై అనుభవం అంతకన్నా లేదు. అయినా రూ.30 వేల అప్పుతో ఓ చిన్న శాండ్‌విచ్‌ బండి పెట్టాడు. వంట నేర్చుకోవడానికి యూట్యూబ్‌ను ఆశ్రయించాడు. ఇప్పుడు అదే బండి రోజుకు వందలాది శాండ్‌విచ్‌లు అమ్ముతూ.. నెలకు రూ.25 లక్షల టర్నోవర్‌ సాధిస్తోంది.

కేఫ్‌ మూతపడినా.. కల మాత్రం ఆగలేదు
అభిషేక్‌ సాహు సుమారు 15 ఏళ్ల క్రితం భోపాల్‌కు వచ్చాడు. అక్కడ ఇంటర్నెట్‌ కేఫ్‌ ప్రారంభించాడు. వ్యాపారం అనుకున్నంతగా సాగలేదు. ఏడాదిలోనే కేఫ్‌ను మూసేయాల్సి వచ్చింది. ఆ ఎదురుదెబ్బతో వ్యాపారం ఆలోచనను వదులుకోలేదు.

ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకపోవడంతో చిన్నగా మొదలుపెట్టాడు. రూ.30 వేలు అప్పు తీసుకొని శాండ్‌విచ్‌ బండి ఏర్పాటు చేశాడు.

వంట రాదు.. యూట్యూబే గురువు
అభిషేక్‌కు అప్పటివరకు ఫుడ్‌ బిజినెస్‌లో ఎలాంటి అనుభవం లేదు. శాండ్‌విచ్‌లు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. దీంతో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ రకరకాల వంటకాలు నేర్చుకున్నాడు. వాటిని ప్రయత్నిస్తూ కస్టమర్లకు శాండ్‌విచ్‌లు అందించడం మొదలుపెట్టాడు.

‘హరి హర్‌ శాండ్‌విచ్‌’ పేరుతో మొదలైన ఈ చిన్న బండి క్రమంగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ సోషల్‌ మీడియా పోస్టు ప్రకారం.. ప్రస్తుతం వారంలో సాధారణ రోజుల్లో 600కు పైగా శాండ్‌విచ్‌లు అమ్ముతున్నాడు. వారాంతాల్లో ఈ సంఖ్య 1,000 దాటుతోంది.

వైరల్‌ వీడియోతో పెరిగిన గిరాకీ
అభిషేక్‌ బండికి సోషల్‌ మీడియా కూడా బాగా కలిసొచ్చింది. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ వైరల్‌ కావడంతో భోపాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కస్టమర్లు అక్కడికి రావడం మొదలుపెట్టారని నవభారత్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.

ప్రస్తుతం అయోధ్య బైపాస్‌ రోడ్డులోని మినాల్‌ రెసిడెన్సీ గేట్‌ నంబర్‌ 3, 4 మధ్య ఈ బండి ఉంది. కాక్రా అభినవ్‌ హోమ్స్‌ ఎదురుగా ఉంటుంది. శాండ్‌విచ్‌ కోసం 30 నుంచి 50 నిమిషాలు వేచి చూసేందుకు కూడా కస్టమర్లు సిద్ధపడుతున్నారని సమాచారం.

రాత్రికి ఏదీ మిగలదు
వ్యాపారం పెరగడంతో అభిషేక్‌ సోదరుడు దీపక్‌ సాహు కూడా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. రోజూ తీసుకొచ్చే పదార్థాలన్నీ రాత్రికల్లా అమ్ముడైపోతాయని ఆయన చెప్పినట్లు లోకల్‌18 కథనం పేర్కొంది.

చిన్న బండి.. రూ.30 వేల అప్పు.. యూట్యూబ్‌లో నేర్చుకున్న వంట. ఇవే అభిషేక్‌ సాహు వ్యాపార ప్రయాణానికి మొదటి మెట్లు. ఇప్పుడు అదే శాండ్‌విచ్‌ బిజినెస్‌ నెలకు సుమారు రూ.25 లక్షల టర్నోవర్‌ సాధిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Advertisement
Abhishek Sahu
Hari Har Sandwich Bhopal
Bhopal street food success story
YouTube cooking business
Entrepreneurship success stories India
Sandwich business turnover

More Telugu News