కాళీఘాట్‌లో ‘మాంసాహార ప్రసాదం’ స్వీకరించిన సువేందు అధికారి

కాళీఘాట్‌లో ‘మాంసాహార ప్రసాదం’ స్వీకరించిన సువేందు అధికారి

Suvendu Adhikari consumes non vegetarian prasad at Kalighat
  • నవరాత్రుల సమయంలో మాంసాహారం తినకూడదన్న బాగేశ్వర్ బాబా
  • అమ్మవారికి చేపలు, మాంసం నైవేద్యంగా పెట్టడం బెంగాల్ సంస్కృతి అన్న బీజేపీ
  • కాళీమాతకు నైవేద్యంగా సమర్పించిన చేప వంటకాన్ని తిన్న సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆహారపు అలవాట్లు, మతపరమైన విశ్వాసాల చుట్టూ తిరిగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. దుర్గాపూజ, నవరాత్రుల సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం విక్రయించకూడదని, తినకూడదని బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను బెంగాలీ ప్రజలు, సాంస్కృతిక వర్గాలు తమ సంప్రదాయంపై దాడిగా భావించగా... బీజేపీకి చెందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అత్యంత వ్యూహాత్మకంగా, బెంగాలీ శైలిలోనే సమాధానం ఇచ్చారు.



కౌశికి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలోని ప్రసిద్ధ, శతాబ్దాల చరిత్ర కలిగిన కాళీఘాట్ ఆలయాన్ని సువేందు అధికారి దర్శించుకున్నారు. ఆలయంలో కాళీమాతకు నైవేద్యంగా సమర్పించిన ప్రసిద్ధ 'భోగ్' (చేప తల, ఫ్రైడ్ ఫిష్, బాసంతి పులావ్)ను ఆయన కింద కూర్చుని ఎంతో తృప్తిగా స్వీకరించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ప్రతీకాత్మకంగా నిరూపించారు.


వివాదం వివరాల్లోకి వెళితే... నవరాత్రుల్లో నాన్-వెజ్ తినేవారిని 'పాఖండీ' (పాపి/కపటి) అని అభివర్ణిస్తూ దుర్గాపూజ సమయంలో మాంసం, మద్యం షాపులు మూసివేయాలని బాగేశ్వర్ బాబా పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బెంగాల్ బీజేపీ నాయకత్వం... ఏ ఆధ్యాత్మికవేత్త కూడా ప్రజల ఆహారపు అలవాట్లను శాసించలేరని, శాక్తేయ సంప్రదాయం ఉన్న బెంగాల్‌లో అమ్మవారికి మేక మాంసం, చేపలు నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ అని స్పష్టం చేసింది.


"నేను సనాతన హిందువుని.. మహాష్టమి రోజున సాత్విక ఆహారం తీసుకుంటాను, కాళీమాతకు సమర్పించిన ప్రసాదంగా మేక మాంసం, చేపలు స్వీకరిస్తాను" అని సువేందు పేర్కొంటూ, ఎవరి నమ్మకాలు వారివని బాబా వ్యాఖ్యలను దాటవేశారు.


భారతదేశంలో ఇతర ప్రాంతాలలో ఆలయ ప్రాంగణంలో నాన్-వెజ్ తింటే వివాదాలు చెలరేగుతాయి కానీ, బెంగాలీ శాక్తేయ సంప్రదాయంలో చేపలు, మాంసం ప్రసాదంగా స్వీకరించడం అనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఉత్తరాది సంస్కృతిని బెంగాల్‌పై రుద్దుతున్నారన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, ప్రాంతీయ సెంటిమెంట్‌ను బీజేపీ గౌరవిస్తుందని స్పష్టం చేసేందుకే సువేందు ఈ భోగ్ స్వీకరించారనే విశ్లేషణలు వస్తున్నాయి.

Advertisement
Suvendu Adhikari
Kalighat Temple
Bageshwar Dham Baba
Non veg Bhog
West Bengal BJP
Bengali Culture Traditions

More Telugu News