సంక్షేమ క్యాలెండర్ సిద్ధం చేయండి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

సంక్షేమ క్యాలెండర్ సిద్ధం చేయండి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu orders Collectors to prepare Welfare Calendar for Andhra Pradesh
  • సంక్షేమ పథకాల పంపిణీకి తేదీలతో కూడిన క్యాలెండర్ రూపకల్పన చేయాల‌న్న సీఎం
  • గత ప్రభుత్వ 'ఫ్యామిలీ మ్యాపింగ్‌ విధానం'పై చంద్రబాబు అసంతృప్తి
  • వక్ఫ్ బోర్డు భూముల నుంచి ఆదాయం పెంచాలని అధికారులకు ఆదేశం
  • కులవృత్తులకు విలువ జోడించేలా కార్యాచరణకు సూచన
  • కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే వినియోగించాలని స్పష్టీక‌ర‌ణ‌
వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ విధానాలపై కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా ఏయే పథకాన్ని ఏ తేదీన అందిస్తున్నామో స్పష్టంగా పేర్కొంటూ ఒక 'సంక్షేమ క్యాలెండర్' రూపొందించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అంతేగాక ప్రభుత్వం అందిస్తున్న నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారిలో ఆర్థిక అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కులవృత్తులకు ఊతమిచ్చేలా, వాటికి విలువ జోడించే (వాల్యూ అడిషన్) కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. చేనేత, చేతివృత్తుల కేంద్రాలను కేవలం అమ్మకపు కేంద్రాలుగా కాకుండా, ప్రజలకు ఒక అనుభూతిని పంచే 'ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు'గా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. కాపు కార్పొరేషన్ రుణాల విషయంలో ఎక్కడైనా నిధులు అందుబాటులో ఉంటే తక్షణమే వాటిని వినియోగించాలని, నిధుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

'ఫ్యామిలీ మ్యాపింగ్‌'పై ముఖ్య‌మంత్రి అసంతృప్తి 
గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన 'ఫ్యామిలీ మ్యాపింగ్' విధానంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ఇష్టానుసారంగా పెన్షన్లు, ఇళ్లు కేటాయించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మన కాన్సెప్ట్ 'కంబైన్డ్ ఫ్యామిలీ' అని, పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు చేకూరేలా నూతన విధానాలు రూపొందించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

మైనార్టీల సంక్షేమం, వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణపై సీఎం ప్రత్యేక దృష్టి  
మైనార్టీల సంక్షేమం, వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. వక్ఫ్ బోర్డుకు లెక్కలేనన్ని భూములు ఉన్నప్పటికీ, ఆదాయం మాత్రం నామమాత్రంగానే వస్తోందని అన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఒక్కరోజే రూ.7 కోట్ల ఆదాయం వస్తుంటే, వేల ఎకరాల ఆస్తులున్న వక్ఫ్ బోర్డు ఆదాయం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. 

అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేసి, ఆస్తుల నుంచి ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించి మైనార్టీ కమ్యూనిటీకి న్యాయం చేయాలని ఆదేశించారు. "మైనార్టీలు బలహీనంగా ఉన్నారు, వారి కోసం పనిచేయాల్సిన మీరూ బలహీనంగానే ఉన్నారు. ఇకనైనా వారికోసం గట్టిగా పనిచేయండి" అని అధికారులకు స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Welfare Calendar
District Collectors Conference
Waqf Board Revenue
AP Family Mapping
Minority Welfare Schemes

More Telugu News