రేవంత్ సీఎం అవడం.. వీరప్పన్ మంత్రి అయినట్లే: కేటీఆర్

రేవంత్ సీఎం అవడం.. వీరప్పన్ మంత్రి అయినట్లే: కేటీఆర్

KTR compares Revanth Reddy becoming CM to Veerappan becoming Minister
  • వీరప్పన్ మంత్రి అయితే ఎలా ఉంటుందో, రేవంత్ సీఎం కావడం అలాగే ఉంద‌న్న కేటీఆర్‌
  • సీఎం కాకముందు ఆర్టీఐతో బ్లాక్‌మెయిల్ చేసి బతికారని ఆరోపణ
  • హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములపై సీఎం కన్ను పడిందన్న మాజీ మంత్రి
  • భూదందాల వల్లే రేవంత్ రాజీనామా చేయాల్సి వస్తుంద‌ని జోస్యం
  • రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమ‌న్న కేటీఆర్‌
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో, భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కూడా అలాగే ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సెక్షన్ 22ఏ భూ బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఆర్టీఐని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి బతికేవారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక ముఠాను ఏర్పాటు చేసి, వారి కనుసన్నల్లో 22ఏ భూ దందా నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చే ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉందని, హిల్ట్ పాలసీ, మూసీ రివర్‌ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ పేర్లతో వేల ఎకరాల భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీని రద్దు చేసి భూదందాలకు తెరలేపారని దుయ్యబట్టారు.

కేసీఆర్ హయాంలో ఫాక్స్‌కాన్ వచ్చిన కొంగరకలాన్ భూములపై రేవంత్ కన్ను పడిందని, అక్కడ రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా మార్చలేరని, కానీ ఇప్పుడు భూభారతితో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతోందని విమర్శించారు. 

భూములను కాపాడాల్సిన కాపలాదారులే కబ్జాదారులుగా మారారని అన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భూదోపిడీ జరుగుతోందని, ఈ వ్యవహారాలతో రేవంత్ రెడ్డి త్వరలోనే రాజీనామా చేయాల్సి వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. మరో రెండేళ్లలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
KTR
Revanth Reddy
Telangana Land Scams
BRS vs Congress
Veerappan Comparison
Section 22A Lands

More Telugu News