స్థానిక సంస్థల ఎన్నికలపై షర్మిల కీలక నిర్ణయం.. రఘువీరారెడ్డి చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
- స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన షర్మిల
- కమిటీలో రుద్రరాజు, పల్లంరాజు, కృపారాణి, తులసిరెడ్డి తదితర నేతలు
- గరిష్ఠ సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచించాలని దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. స్థానిక పోరులో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేయడం కోసం 8 మంది సీనియర్ నాయకులతో కూడిన 'రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ'ని ఆమె ఏర్పాటు చేశారు. ఈ అత్యున్నత కమిటీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మానిటరింగ్ కమిటీలో మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత కల్పించారు. కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్ర మంత్రి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సభ్యులుగా సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, రాజ్యసభ మాజీ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డిని నియమించారు. వీరితో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా నిర్వహణ, ఎన్నికల సమన్వయ ఇన్ఛార్జి బాధ్యతలను నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్ఠ సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని మానిటరింగ్ కమిటీకి షర్మిల స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధివిధానాల ఖరారు, గెలుపు గుర్రాలైన అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాల బాధ్యతలను ఈ కమిటీయే చూస్తుందని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మానిటరింగ్ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆదేశించారు.