11 ఏళ్లుగా కీమోథెరపీ.. చివరకు అసలు క్యాన్సరే కాదని తేలింది!

11 ఏళ్లుగా కీమోథెరపీ.. చివరకు అసలు క్యాన్సరే కాదని తేలింది!

11 years of chemotherapy only to find out there was no cancer at all
  • బెక్కీ జోన్స్‌కు 2012లో బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని చెప్పిన డాక్టర్లు
  • క్యాన్సర్‌ భయంతో ఆమె 11 ఏళ్ల పాటు కీమోథెరపీ చికిత్స
  • 2025లో ఆమె రిపోర్ట్స్‌ను పరిశీలించిన స్వతంత్ర నిపుణులు
  • స్కాన్‌లో కనిపించిన గాయం ట్యూమెఫ్యాక్టివ్‌ డీమైలినేషన్‌ అని నిర్ధారణ
  • అరుదైన కేసుల్లో మరో నిపుణుడి అభిప్రాయం తీసుకోవాలని చెబుతున్న ఘటన
ఒక్కసారి ఊహించండి.. మీకు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని వైద్యులు చెబుతారు.. చికిత్స ఆపేస్తే ప్రాణాలకు ప్రమాదమని పదేపదే హెచ్చరిస్తారు.. దీంతో నెలలు కాదు.. సంవత్సరాల తరబడి కీమోథెరపీ చేయించుకుంటూ జీవిస్తారు. అలా ఏకంగా 11 ఏళ్లు గడిచిన తర్వాత.. అసలు మీకు క్యాన్సరే రాలేదని తెలిస్తే? బ్రిటన్‌కు చెందిన బెక్కీ జోన్స్‌ విషయంలో ఇదే జరిగింది. 2012లో మొదలైన ఈ కథ 2025లో ఊహించని మలుపు తిరిగింది.

తీవ్రమైన తలనొప్పితో మొదలైన కథ
2012లో జోన్స్‌కు తీవ్రమైన మైగ్రేన్‌ సమస్యలు మొదలయ్యాయి. వైద్యులు ఆమెకు బ్రెయిన్‌ స్కాన్లు చేయగా మెదడులో ఏదో అసాధారణంగా కనిపించింది. దాన్ని ట్యూమర్‌గా భావించారు. దీంతో ఆమెను బ్రెయిన్‌ క్యాన్సర్‌ రోగిగా పరిగణించి చికిత్స మొదలుపెట్టారు.

ఆ తర్వాత జోన్స్‌ జీవితంలో కీమోథెరపీ భాగమైపోయింది. నెలలు, సంవత్సరాలు గడిచినా చికిత్స కొనసాగింది. చికిత్స ఆపితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆమెకు చెబుతూ వచ్చారు. దీంతో క్యాన్సర్‌ ఉందనే భయంతోనే ఆమె తన జీవితంలో కీలకమైన 11 సంవత్సరాలను గడిపారు.

2025లో బయటపడిన అసలు నిజం
2025లో ఆమె వైద్య రికార్డులను స్వతంత్ర న్యూరోసర్జన్లు, రేడియాలజిస్టులు పరిశీలించారు. పాత స్కాన్లను మరోసారి నిశితంగా పరిశీలించిన నిపుణులు.. అది క్యాన్సర్‌ ట్యూమర్‌ కాదని, ట్యూమెఫ్యాక్టివ్‌ డీమైలినేషన్‌ అని గుర్తించారు.

ఇది మెదడులోని నరాలపై ఉండే రక్షణ పొర దెబ్బతినడం వల్ల కలిగే వాపు. ఈ ప్రక్రియలో మెదడులో ముద్దలా కనిపించే గాయం ఏర్పడొచ్చు. స్కాన్‌లో అది ట్యూమర్‌లా కనిపించే అవకాశం ఉండటంతో అసలు వ్యాధిని గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది.

ఆనందం కంటే.. 11 ఏళ్ల బాధే గుర్తొచ్చింది
తనకు క్యాన్సర్‌ లేదని తెలుసుకున్నప్పుడు జోన్స్‌కు అది కేవలం ఉపశమనం కలిగించే వార్తగా మిగలలేదు. ఇన్నేళ్లుగా తాను తీసుకున్న చికిత్స, ఎదుర్కొన్న బాధ, క్యాన్సర్‌ భయంతో గడిపిన జీవితం మొత్తం ఆమె కళ్లముందు నిలిచాయి.

‘‘నాకు ఎప్పుడూ బ్రెయిన్‌ ట్యూమర్‌ లేదు. నాకు తప్పుగా నిర్ధారణ చేశారు. నా వయోజన జీవితంలో ఎక్కువ భాగం ఎలాంటి కారణం లేకుండానే ఈ చికిత్సను ఎదుర్కొన్నాను’’ అని ఆమె చెప్పినట్లు బీబీసీ నివేదించింది.

రెండో అభిప్రాయం ఎందుకు కీలకం?
తీవ్రమైన వ్యాధి నిర్ధారణ అయినప్పుడు మరో నిపుణుడి అభిప్రాయం తీసుకోవడం అంటే మొదటి వైద్యుడిని తప్పుబట్టడం కాదు. ముఖ్యంగా అరుదైన వ్యాధులు, స్పష్టంగా అర్థం కాని స్కాన్‌ ఫలితాలు, జీవితాన్ని మార్చే చికిత్సల విషయంలో మరో నిపుణుడి పరిశీలన ఉపయోగపడొచ్చు.

జోన్స్‌ ఘటన కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తోంది. ఒకే స్కాన్‌ను మరో నిపుణుడు మరో కోణంలో పరిశీలించడంతో 11 ఏళ్లుగా కొనసాగిన క్యాన్సర్‌ నిర్ధారణపై పూర్తిగా భిన్నమైన నిజం బయటపడింది.

వైద్యపరమైన తప్పిదం ప్రభావం కేవలం చికిత్సకే పరిమితం కాదు. ఉద్యోగం, కుటుంబ నిర్ణయాలు, ఆర్థిక పరిస్థితి, మానసిక ప్రశాంతత.. ఇలా జీవితంలోని ఎన్నో అంశాలపై అది ప్రభావం చూపుతుంది. అందుకే అరుదైన లేదా అనుమానాస్పద వైద్య పరిస్థితుల్లో అవసరమైతే నిపుణుల రెండో అభిప్రాయం తీసుకోవడం ఎంత ముఖ్యమో జోన్స్‌ కథ మరోసారి చెబుతోంది.
Advertisement
Becky Jones
Brain Tumor Misdiagnosis
Chemotherapy
Tumefactive Demyelination
UK Medical News
Second Medical Opinion

More Telugu News