'గోషామహల్‌లో బంగారం, వజ్రాలతో గణేశుడు'.. స్పందించిన పోలీసులు!

'గోషామహల్‌లో బంగారం, వజ్రాలతో గణేశుడు'.. స్పందించిన పోలీసులు!

Goshamahal Ganesh idol with gold and diamonds police respond to rumors
  • గోషామహల్‌ గణేశుడిపై సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం
  • పంచలోహ విగ్రహమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన పోలీసులు
  • బంగారు తాపడం, వజ్రాల అలంకరణ ఉందన్నది అబద్ధమని వెల్లడి
  • వదంతులు నమ్మొద్దని, షేర్ చేయొద్దని ప్రజలకు పోలీసుల సూచన
హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ప్రతిష్ఠించిన 'లాల్‌బాగ్‌చా రాజా గణేశ్-2026' విగ్రహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఓ గణేశుడి విగ్రహం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారని, 48 కిలోల బరువుతో పాటు 24 క్యారెట్ల బంగారు తాపడం చేశారని, అలాగే 3,83,800 కృత్రిమ వజ్రాలతో అలంకరించారని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రచారంపై గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో పేర్కొంటున్నట్లుగా ఈ విగ్రహాన్ని పంచలోహాలతోగానీ, బంగారంతోగానీ తయారు చేయలేదని ఆయన తేల్చిచెప్పారు. సదరు ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇటువంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ఇతరులకు చేరవేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
Advertisement
Goshamahal Ganesh Idol
Hyderabad Police
Fake News
Gold Plated Ganesh
Lalbaugcha Raja Hyderabad

More Telugu News