ఢిల్లీకి పుతిన్ బుల్లెట్ ప్రూఫ్ కారు.. చక్రాలపై తిరిగే 'కోట' ఇది.. దీని ముందు ఏ కారైనా దిగదుడుపే!

ఢిల్లీకి పుతిన్ బుల్లెట్ ప్రూఫ్ కారు.. చక్రాలపై తిరిగే 'కోట' ఇది.. దీని ముందు ఏ కారైనా దిగదుడుపే!

Vladimir Putin Bulletproof Car in Delhi This Fortress on Wheels Outshines Every Other Car
  • బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆయన బుల్లెట్ ప్రూఫ్ 'ఆరస్ సెనాట్' కారు
  • చక్రాలపై తిరిగే కోటగా పిలిచే ఈ కారు అత్యంత శక్తిమంతమైనది
  • రష్యాలోనే ప్రత్యేకంగా ప్రభుత్వ అవసరాల కోసం దీని తయారీ
  • గతంలో ప్రధాని మోదీ కూడా పుతిన్‌తో కలిసి ఈ కారులో ప్రయాణం
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన రాకతో పాటు, ఆయనతో పాటు వచ్చిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా కాన్వాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కాన్వాయ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది పుతిన్ అధికారిక వాహనం 'ఆరస్ సెనాట్ లిమోజిన్'. దీన్ని నిపుణులు 'చక్రాలపై తిరిగే కోట'గా అభివర్ణిస్తారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ
రష్యా ప్రభుత్వ అవసరాల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో వాహనాలను తయారు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'కోర్టెజ్' ప్రాజెక్టులో భాగంగా 'ఆరస్ మోటార్స్' ఈ కారును అభివృద్ధి చేసింది. సోవియట్ కాలం నాటి ZIS-110 లిమోజిన్ స్ఫూర్తితో 2018లో దీన్ని రూపొందించారు. విదేశీ పర్యటనల్లో పుతిన్ ఎక్కువగా ఈ బుల్లెట్‌ప్రూఫ్, పేలుడు నిరోధక వాహనంలోనే ప్రయాణిస్తారు. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు.

ధర, ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఈ కారులో 4.4-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్‌ను హైబ్రిడ్ సిస్టమ్‌తో అనుసంధానించారు. ఇది సుమారు 598 హార్స్‌పవర్ శక్తిని, 880 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేసే ఈ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 

అధ్యక్షుడి కోసం వాడే ఈ వేరియంట్‌లో అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించారు. దీని ఇంటీరియర్ అత్యంత విలాసవంతంగా, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఉంటుంది. సాధారణ పౌరుల కోసం పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేసే సెనాట్ మోడల్ ధర సుమారు 18 మిలియన్ రూబుల్స్ (దాదాపు రూ. 2.5 కోట్లు) ఉంటుంది.

గతంలో 'షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్' (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే కారులో పుతిన్‌తో కలిసి ప్రయాణించడం అప్పట్లో విశేషంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ వాహనం ఢిల్లీలో కనిపించడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Advertisement
Vladimir Putin
Aurus Senat Limousine
BRICS Summit Delhi
Putin Bulletproof Car
Aurus Motors Russia
Russia India Relations

More Telugu News