ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

Anak Krakatau volcano erupts in Indonesia viral video surfaces
  • ఇండోనేషియాలో అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలైన వైనం
  • దట్టమైన బూడిద కారణంగా 8 విమానాశ్రయాలు మూసివేత, 2300 ఫ్లైట్లు రద్దు
  • విమానాశ్రయాల్లో చిక్కుకున్న సుమారు 2.70 లక్షల మంది ప్రయాణికులు 
  • సునామీ ప్రమాదం లేదన్న అధికారులు, లెవెల్-3 హెచ్చరికలు జారీ
ఇండోనేషియాలోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలవడం తెలిసిందే. సుమారు 25 గంటల పాటు నిరంతరాయంగా లావా, బూడిద వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విస్ఫోటనం కారణంగా ఆకాశమంతా దట్టమైన బూడిద మేఘాలు అలుముకోవడంతో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ అగ్నిపర్వతం 24 గంటల పాటు ఏకధాటిగా లావాను వెలిగక్కింది. ఈ విస్ఫోటానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆకాశంలో దట్టమైన బూడిద వ్యాపించడంతో ముందుజాగ్రత్త చర్యగా జకార్తాలోని సోకర్నో-హట్టా, హలిమ్ పెర్దనకుసుమ అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 8 ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.

ఈ నిర్ణయంతో సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు లేదా దారి మళ్లించారు. దీనివల్ల దాదాపు 2.70 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ లెవెల్-3 (హై అలర్ట్) హెచ్చరికను జారీ చేసింది. స్థానికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అయితే, ఈ విస్ఫోటనం వల్ల సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2018లో ఇదే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు సంభవించిన సునామీ కారణంగా సుమారు 430 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి బూడిద, విష వాయువులు, వేడి రాళ్ల ముప్పు మాత్రమే ఉందని తెలిపారు. పరిస్థితి వేగంగా మారుతున్నందున విమానాశ్రయాల పునఃప్రారంభంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని రవాణా శాఖ మంత్రి దుదీ పుర్వగంధీ పేర్కొన్నారు. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో ఇండోనేషియాలో తరచూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి.
Advertisement
Anak Krakatau
Indonesia volcano eruption
Jakarta airport closure
Volcanic ash cloud
Indonesia travel alert
Pacific Ring of Fire

More Telugu News