కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు: జగదీశ్ రెడ్డి
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫాంహౌస్ వైపు పంపడం ఏ రకమైన సంస్కారమన్న జగదీశ్ రెడ్డి
- కేసీఆర్‌ను అంతమొందించేందుకే వెళుతున్నామని ఓ ఎమ్మెల్యే అన్నారని మండిపాటు
- కేసీఆర్ పైకి కావాలనే నిరసనకారులను పంపుతున్నారని ఆగ్రహం
తాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన సైనికులమని... కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలకు, పోలీసుల అక్రమ అరెస్టులకు తాము ఏమాత్రం భయపడేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ దారుణాలను, వైఫల్యాలను ప్రజల కళ్లకు కట్టినట్లు ఎండగడుతుంటే తట్టుకోలేకనే ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ నడుస్తుండగా ప్రభుత్వ విప్‌లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను డప్పులు కొట్టుకుంటూ కేసీఆర్ ఫాంహౌస్ వైపు పంపడం ఏ రకమైన సంస్కారమని జగదీశ్ రెడ్డి నిలదీశారు. 'కేసీఆర్‌ను అంతమొందించేందుకే వెళుతున్నాం' అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయనపై పోలీసులు వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌పైకి కావాలనే నిరసనకారులను పంపుతున్నారని, పోలీసులు వారిని ఆపకపోతే బీఆర్‌ఎస్ శ్రేణులే రంగంలోకి దిగి తగిన రీతిలో బుద్ధి చెబుతాయని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌ను కాపాడుకోవడం తమకు, తెలంగాణ సమాజానికి పెద్ద కష్టమేమీ కాదని తేల్చిచెప్పారు.
శాసనసభకు వస్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంపై తాము హైకోర్టును ఆశ్రయించగా... ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా ఎవరు, ఎందుకు అడ్డుకున్నారనే వివరాలను రెండు వారాల్లో సమర్పించాలని అత్యున్నత నాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ భయంతోనే రాత్రికి రాత్రే బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రజలకు తాగడానికి, సాగుకు నీళ్లు ఇవ్వలేక, పేదల భూములను గుంజుకుని అమ్ముకుంటూ కాంగ్రెస్ నేతలు సొంత జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు.