శుభకార్యానికి హిజ్రాలు అంత కచ్చితంగా ఎలా వస్తారు?.. బయటపడ్డ పక్కా కమీషన్ దందా!

శుభకార్యానికి హిజ్రాలు అంత కచ్చితంగా ఎలా వస్తారు?.. బయటపడ్డ పక్కా కమీషన్ దందా!

Hijras secret commission network for auspicious events revealed
  • శుభకార్యాలకు హిజ్రాలు ఎలా వస్తారనే రహస్యంపై ఓ హిజ్రా స్పష్టత
  • టెంట్ హౌస్‌లు, పంతుళ్లు, వాచ్‌మెన్ల నుంచి సమాచారం అందుతుందని వెల్లడి
  • ఒక్కో ఫంక్షన్ లోకేషన్ చెప్పినందుకు రూ.2000 నుంచి రూ.3000 కమీషన్
  • కొందరి వల్లే తమందరికీ చెడ్డపేరు వస్తోందని ఆవేదన
  • చింతల్ ఘటన తర్వాత నెట్టింట‌ చర్చనీయాంశమైన హిజ్రాల నెట్‌వర్క్
శుభకార్యాలు, వేడుకలు జరిగే ప్రదేశాలకు హిజ్రాలు కచ్చితంగా ఎలా వస్తారు? ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వారికి ముందుగా సమాచారం ఎలా అందుతుంది? ఈ ప్రశ్నలు చాలామంది మదిని తొలిచేవే. ఇటీవల హైదరాబాద్‌లోని చింతల్‌లో ఓ గృహప్రవేశం సందర్భంగా హిజ్రాలు ప్రవర్తించిన తీరుపై తీవ్ర దుమారం రేగడంతో వారి సమాచార వ్యవస్థపై చర్చ మొదలైంది. దీని వెనుక ఓ పక్కా వ్యవస్థ, పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ వీరికి సమాచారం ఎలా అందుతుందంటే.. దీని వెనుక పక్కా కమీషన్ దందా నడుస్తోందని ఓ హిజ్రా స్వయంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాల వివరాలను తమకు చేరవేసేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు పనిచేస్తారని ఆమె తెలిపారు. వారి ద్వారానే తమకు ఫంక్షన్ల లోకేషన్లు తెలుస్తాయని వివరించారు.

సమాచారం ఇచ్చేది వీరే..
ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. శుభకార్యాలకు సంబంధించిన వ్యక్తులే హిజ్రాలకు ప్రధాన ఇన్ఫార్మర్లు.
టెంట్ హౌస్ వాళ్లు: ఫంక్షన్‌కు టెంట్లు, కుర్చీలు సరఫరా చేసేవారు.
పంతుళ్లు: పూజలు, శుభకార్యాలు జరిపించే పురోహితులు.
గోమాతను తెచ్చేవారు: గృహప్రవేశాల వంటి వాటికి గోమాతను తీసుకువచ్చేవారు.
సన్నాయి మేళం వాళ్లు: ఫంక్షన్లలో సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు.
బిల్డర్లు, వాచ్‌మెన్లు: కొత్తగా నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో పనిచేసేవారు.

ఈ వ్యక్తులు ఫలానా చోట ఫంక్షన్ జరుగుతోందని ముందుగానే తమకు ఫోన్ చేసి లోకేషన్ పంపిస్తారని సదరు హిజ్రా తెలిపారు.

లోకేషన్‌కు రూ.3000 కమీషన్
కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, దీనికి వారు కమీషన్ కూడా తీసుకుంటారని ఆమె చెప్పడం గమనార్హం. గతంలో ఒక్కో లోకేషన్‌కు రూ.200 నుంచి రూ.500 ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు డిమాండ్ పెరగడంతో రూ.2000 ఇవ్వనిదే ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. ముఖ్యంగా గృహప్రవేశానికి గోమాతను తీసుకొచ్చేవారు రూ.3000 వరకు డిమాండ్ చేస్తారని, అంత ఇస్తేనే గానీ అడ్రస్ చెప్పరని వివరించారు. ఈ నెట్‌వర్క్‌లో ఎవరు ముందుగా సమాచారం ఇస్తే, వారికే కమీషన్ డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.

కొందరి వల్లే అందరికీ చెడ్డపేరు
చింతల్ ఘటనపై స్పందిస్తూ, కొందరు హిజ్రాలు మాత్రమే డబ్బుల కోసం దౌర్జన్యంగా ప్రవర్తిస్తారని, వారి వల్లే తమ వర్గం మొత్తానికీ చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా కడుపు నింపుకోవడానికే ఈ పని చేస్తామని, చాలామంది ఎంత ఇస్తే అంత తీసుకుని ఆశీర్వదించి వెళ్లిపోతారని చెప్పారు. కొందరు దాతలు తమను స్వయంగా ఇళ్లకు పిలిపించుకుని గౌరవిస్తారని గుర్తుచేశారు. ఏదేమైనా శుభకార్యాల వద్ద హిజ్రాల సందడి వెనుక ఇంత పెద్ద కమీషన్ నెట్‌వర్క్ పనిచేస్తోందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Hijras
Hyderabad housewarming events
Hijra commission network
Transgender community news
Function hall informers
Event location commission

More Telugu News