భారతీయులకు రూమ్‌.. పాక్‌ ఎంపీకి నో ఎంట్రీ.. యూఏఈలో షాకింగ్‌ ఘటన

Room for Indians No Entry for Pakistan MP Shocking incident in UAE
  • యూఏఈ హోటల్‌లో పాక్‌ ప్రయాణికులకు వివక్ష జరిగిందని ఎంపీ ఆరోపణ
  • భారతీయులు, అమెరికన్లకు మాత్రమే వసతి ఇచ్చారని ఆరోపణ
  • విమానం రద్దు తర్వాత ఈ ఘటన జరిగిందని అసద్‌ ఖైసర్‌ వెల్లడి
  • తనకు కూడా ఇదే అనుభవం ఎదురైందని పాక్‌ ఎంపీ వ్యాఖ్య
  • అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ పరపతిపై ఈ ఘటనతో చర్చ
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ పరపతి ఏంటో చెప్పేందుకు ఈ ఘటన చాలు అనే చర్చ మొదలైంది. సొంతంగా ఆ దేశ ఎంపీ చేసిన ఆరోపణలే ఇప్పుడు పాక్‌ ఇమేజ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విమానం రద్దైన తర్వాత హోటల్‌ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్‌ మాజీ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌, ఎంపీ అసద్‌ ఖైసర్‌ కూడా ఈ ఘటనలో ఉన్నారు. యూఏఈలో తన విమానం రద్దు కావడంతో హోటల్‌లో బస కోసం ప్రయత్నించామని చెప్పారు. అయితే భారతీయులు, అమెరికా పాస్‌పోర్టు ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని హోటల్ వారు ప్రకటించారని ఆరోపించారు. పాకిస్థానీ ప్రయాణికుల పట్ల మాత్రం హోటల్‌ సిబ్బంది తీరు సరిగా లేదని పాక్‌ పార్లమెంట్‌లోనే ఆవేదన వ్యక్తం చేశారు.

యూఏఈ తమకు సన్నిహిత ఇస్లామిక్‌ దేశమని చెబుతూనే.. అక్కడ ఇలాంటి అనుభవం ఎదురవడంపై ఖైసర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని దౌత్య మార్గాల ద్వారా యూఏఈ ప్రభుత్వంతో చర్చించాలని పాక్‌ విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. యూఏఈ అభివృద్ధిలో పాకిస్థానీయుల పాత్ర కూడా ఉందని గుర్తుచేశారు.

ఇదే తరహా అనుభవాలు ఎదురయ్యాయని కొందరు తనను కలిసి ఫిర్యాదు చేశారని ఖైసర్‌ వెల్లడించారు. యూఏఈలో 15 లక్షల మందికిపైగా పాకిస్థానీయులు నివసిస్తున్నారని అంచనా. అయినప్పటికీ భారతీయులు, అమెరికన్లకు వసతి కల్పించి పాకిస్థానీయులను పక్కన పెట్టారన్న పాక్‌ ఎంపీ ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
Advertisement
Asad Qaiser
UAE hotel refusal
Pakistan MP
Indian travelers UAE
Pakistan UAE diplomatic relations
Asad Qaiser UAE incident

More Telugu News