‘స్వాతంత్య్ర సమరయోధులను అవమానిస్తున్నారు’.. కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఫైర్‌

Amit Shah slams Congress for insulting freedom fighters
  • 1937 నిర్ణయం దేశ విభజనకు బీజం వేసిందన్న అమిత్‌ షా
  • ఆ నిర్ణయంతో ద్విజాతి సిద్ధాంతానికి బలం వచ్చిందని విమర్శ
  • బంకించంద్రుడి రచనను కాంగ్రెస్‌ అవమానిస్తోందని షా ఆరోపణ
  • పూర్తి వందేమాతరంతో దేశ ఐక్యత బలోపేతమవుతుందన్న షా 
  • రాహుల్‌ నాయకత్వంలో బుజ్జగింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శ
వందేమాతరం విషయంలో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలనే పాడాలన్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది సాధారణ నిర్ణయం కాదని.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను అవమానించడమేనని ఆరోపించారు. 1937లో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ అమలు చేయడం ద్వారా అప్పటి తప్పిదాన్ని పునరావృతం చేస్తోందని విమర్శించారు.

“1937లో ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వందేమాతరాన్ని రెండు భాగాలుగా చేసింది. అదే దేశ విభజనకు బీజం వేసింది. అక్కడి నుంచి ద్విజాతి సిద్ధాంతానికి బలం వచ్చింది. చివరకు దేశం విడిపోయి పాకిస్థాన్‌ ఏర్పడింది” అని షా ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మళ్లీ అదే నిర్ణయాన్ని అమలు చేస్తోందని అన్నారు.

బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని షా పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ బంకించంద్రుడి గొప్ప రచనను మాత్రమే కాదు.. "వందేమాతరం" అంటూ ఉరికంబాలు ఎక్కిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులను కూడా అవమానిస్తోందని విమర్శించారు. ఎన్నో ఏళ్లు జైళ్లలో గడిపిన వీరుల త్యాగాలను కూడా విస్మరిస్తోందని అన్నారు.

వందేమాతరం రచనకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసిందని షా తెలిపారు. దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు పూర్తి వందేమాతరాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాడేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి అధికారిక మార్గదర్శకాలు కూడా జారీ చేశామని వెల్లడించారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మాత్రం పార్లమెంట్‌ నిర్ణయాన్ని కాదని.. 1937 నాటి పార్టీ తీర్మానాన్ని అమలు చేస్తోందని షా విమర్శించారు. కాంగ్రెస్‌ మళ్లీ బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలను దేశ ప్రజలు సహించబోరని అన్నారు.

కాగా, కాంగ్రెస్‌ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించింది. 1937లో మహాత్మా గాంధీ, నెహ్రూ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, సర్దార్‌ పటేల్‌ తదితర అగ్రనేతలు ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు పాటిస్తున్నామని కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలనే పాడతామని స్పష్టం చేశారు. వందేమాతరం, జాతీయ గీతం తమకు భావోద్వేగ అంశాలని.. బీజేపీ మాత్రం దీనిని రాజకీయ అంశంగా మార్చిందని విమర్శించారు.
Advertisement
Amit Shah
Congress Party
Vande Mataram
Freedom Fighters
Vote Bank Politics
National Song India

More Telugu News