విద్యాహక్కు చట్టం కింద లక్ష దాటిన ప్రవేశాలు.. ప్రజా ప్రభుత్వ ఘనతన్న మంత్రి లోకేశ్

Nara Lokesh says RTE admissions crossed one lakh mark under Praja Prabhutvam
  • ప్రజా ప్రభుత్వ పాలనలో విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు బాగా పెరిగాయన్న మంత్రి 
  • 2022-26 మధ్య ప్రైవేట్ పాఠశాలల్లో 1,04,046 మందికి అవకాశం
  • 2022-23లో కేవలం 2,203గా ఉన్న ప్రవేశాలు, 2024-25లో 29 వేలకు చేరిక‌
  • ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నామని వెల్లడి
  • ఆర్టీఈపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడమే ఇందుకు కారణమని వివరణ
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో గణనీయమైన పురోగతి సాధించామని, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నేడు శాసనమండలిలో ఆర్టీఈ ప్రవేశాలపై సభ్యులు కావలి గ్రీష్మ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు.

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) కింద ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే ప్రక్రియను ప్రజాప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తోంది. దీని ఫలితంగా 2022-23 నుంచి 2026-27 విద్యా సంవత్సరం వరకు మొత్తం 1,04,046 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. పూర్తి పారదర్శకత కోసం అడ్మిషన్ల ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నాం" అని వివరించారు.

గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రవేశాల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని లోకేశ్ గణాంకాలతో సహా వివరించారు. "2022-23 విద్యా సంవత్సరంలో కేవలం 2,203 మంది విద్యార్థులు మాత్రమే ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందారు. కానీ, ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే, అంటే 2024-25లో, ఈ సంఖ్య ఏకంగా 29,000కు పెరిగింది. అదేవిధంగా, 2026-27లో 28,742 మంది విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో సీట్లు లభించాయి. ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం" అని అన్నారు.

విద్యాహక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని, దాని ఫలితంగానే అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు పెరిగాయని మంత్రి తెలిపారు. సమాజంలోని ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఆర్టీఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
Nara Lokesh
Right to Education Act
Andhra Pradesh Education Department
RTE School Admissions
Private School Seats for Poor
AP Legislative Council

More Telugu News