రాహుల్ గాంధీ వాడిన భాష పాకిస్థాన్, ఆ దేశానికి మద్దతిచ్చే ఉగ్రవాదుల భాషను పోలి ఉంది: బీజేపీ ఆగ్రహం
- మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
- ఆయన వ్యాఖ్యలు ఉగ్రభాషను పోలి ఉందన్న బీజేపీ
- ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణ
రాహుల్ గాంధీ వాడిన భాష పాకిస్థాన్, ఆ దేశానికి మద్దతిచ్చే ఉగ్రవాదుల భాషను పోలి ఉందని బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. అక్కడి నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని అవమానించడం అతడికి అలవాటుగా మారిందని అన్నారు.
రాహుల్ గాంధీ భాష పాకిస్థాన్ నాయకుల భాషలా ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రపంచానికి తెలుసని, రాహుల్ గాంధీ నుంచి ప్రశంసలు అవసరం లేదని విమర్శించారు. దేశంలో అశాంతిని రగల్చాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని అన్నారు. కానీ మోదీ, అమిత్ షాలకు ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ మరిచిపోకూడదని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధానిని అనడం ద్వారా రాహుల్ గాంధీ 140 కోట్ల మంది ప్రజలను దేశద్రోహులుగా పేర్కొన్నట్లే అన్నారు. ఆయన భాష పాకిస్థాన్, ఉగ్రవాదులను పోలి ఉందని విమర్శించారు.
భారత రాజ్యాంగాన్ని కూల్చివేసే పనిని కాంగ్రెస్ చేపట్టిందని సీనియర్ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ఈ రోజు ఏవైతే మాట్లాడుతున్నారో, నాడు ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. అవమానకరమైన భాషను ఉపయోగించడం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రధాని మోదీని దూషించడం, ఆరెస్సెస్‌ను దూషించడం వారికి పరిపాటిగా మారిందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.