పశ్చిమాసియా టెన్షన్.. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
- పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన మార్కెట్లు
- 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
- భారీగా పెరిగిన ముడిచమురు ధరలు, అమ్మకాల ఒత్తిడి
- అన్ని రంగాల షేర్లలోనూ కనిపించిన అమ్మకాల హోరు
- 15 శాతం మేర పెరిగిన ఇండియా విక్స్ సూచీ
ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయి 73,421 వద్ద ట్రేడ్ అయింది. అలాగే, నిఫ్టీ కూడా 286 పాయింట్లు కోల్పోయి 23,080 వద్దకు జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. రియల్టీ సూచీ దాదాపు 2 శాతం పడిపోగా, మెటల్, ఆటో, ఐటీ సూచీలు 1 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి.
నిఫ్టీలో విప్రో, టీసీఎస్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి షేర్లు మేజర్ లూజర్లుగా నిలిచాయి. ఫ్రంట్‌లైన్ సూచీలతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 1 శాతం మేర పతనమయ్యాయి. మార్కెట్లలో భయానికి సూచికగా భావించే ఇండియా విక్స్ (VIX) ఏకంగా 15 శాతం పెరిగి 18 స్థాయికి చేరడం ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనను సూచిస్తోంది.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య దాడులు పునరుద్ధరించడం, ఇరాన్‌లోని పలు నగరాల్లో పేలుళ్లు సంభవించాయన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళనలను పెంచాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే ముడిచమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 శాతం పెరిగి బ్యారెల్‌కు 96.90 డాలర్లకు చేరింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా 4.64 శాతం పెరిగి 94.75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
టెక్నికల్‌గా నిఫ్టీ కీలక మూవింగ్ యావరేజ్‌ల కంటే దిగువనే ట్రేడ్ అవుతోందని, ఇది బలహీనతకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీకి 23,100-23,000 జోన్ వద్ద తక్షణ మద్దతు, 23,500-23,700 శ్రేణిలో నిరోధం ఉందని అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లపై ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావం కూడా పడింది. జపాన్‌కు చెందిన నిక్కీ దాదాపు 4 శాతం, దక్షిణ కొరియా కోస్పి 5 శాతం, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 1 శాతం మేర పతనమయ్యాయి.