'పెద్ది' వివాదంపై నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు!

Nithya Menen sensational comments on Peddi controversy
  • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు
  • మహిళలను గ్లామర్ వస్తువులుగా చూపించడాన్ని తప్పుబట్టిన నిత్య మీనన్ 
  • అభ్యంతరకర సీన్లు ఉంటే హీరోయిన్లే నిర్మొహమాటంగా నో చెప్పాలని పిలుపు 
  • విమర్శలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4న విడుదలైన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర)ను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్‌లో ఆమె శరీరాన్ని జూమ్ చేస్తూ చూపించడం, ఆమె ప్రమేయం లేకుండా హీరో తాకే సీన్లను రొమాంటిక్‌గా చూపించడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను ఇంకా ఈ సినిమా చూడలేదని చెబుతూనే.. జాన్వీ కపూర్‌కు ఎదురవుతున్న విమర్శలపై నిత్య మీనన్ స్పందించారు. "సినిమాల్లో మహిళలను కేవలం ఒక అందాల వస్తువుగా (Objectification) చూపించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి సీన్లు చేసేటప్పుడు నటీనటులకు కొన్ని హద్దులు ఉండాలి. తమకు నచ్చని సీన్లు ఉన్నప్పుడు 'మేము ఇది చేయలేం' అని నిర్మొహమాటంగా చెప్పే ధైర్యం ఉండాలి. కెరీర్ ప్రారంభం నుంచే ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం" అని నిత్య మీనన్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడింది.

దక్షిణాది సినిమాలనే అనడం తప్పు
కేవలం సౌత్ ఇండియన్ సినిమాల్లోనే ఇలా జరుగుతుందనే ప్రచారాన్ని నిత్య మీనన్ తప్పుబట్టింది. ఇది కేవలం ఒక్క పరిశ్రమకు సంబంధించిన సమస్య కాదని, బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. గతంలో సీనియర్ నటి అను అగర్వాల్ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ.. నటీనటులు తమ గౌరవాన్ని తగ్గించే పాత్రలను తిరస్కరించాలని కోరింది. జాన్వీ కపూర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

 దర్శకుడి క్షమాపణ.. సీన్ల కటింగ్ 
ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అభ్యంతరాలను గౌరవిస్తూ సినిమాలోని వివాదాస్పద సీన్లకు సంబంధించిన దాదాపు 3 నిమిషాల ఫుటేజీని థియేట్రికల్ వెర్షన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఈ క్యారెక్టరైజేషన్‌పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నప్పటికీ, 'పెద్ది' సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Go Back to Shorts
Nithya Menen
Peddi Movie Controversy
Janhvi Kapoor
Buchi Babu Sana
Ram Charan
Cinema Objectification

More Telugu News