ఐఐటీ రిజెక్షన్‌తో డిప్రెషన్.. 26 ఏళ్లకే తండ్రికి రూ.55 లక్షల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్

Shaurya Shikhar gifts 55 lakh BMW car to father after overcoming IIT rejection and depression
  • పారిశ్రామికవేత్త అంకుర్‌ వారికూ పంచుకున్న సక్సెస్‌ స్టోరీ
  • ఐఐటీ-జేఈఈలో ఫెయిల్‌ అయ్యానని కుంగిపోయిన శౌర్య శిఖర్
  • ఒత్తిడితో 110 కిలోలకు పెరిగిన బరువు
  • కుంగుబాటు నుంచి బయటపడి శ్రమించిన శిఖర్‌
  • నేడు నెలకు రూ.లక్షల్లో సంపాదన
ఒక్కోసారి జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద పరాజయమే.. మనల్ని సరికొత్త శిఖరాలకు చేర్చే అద్భుతమైన మలుపు కావచ్చు. ఐదేళ్ల క్రితం ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఫెయిల్ అయ్యానని, తన జీవితం ముగిసిపోయిందని ఏడ్చిన ఓ యువకుడు.. నేడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కేవలం 26 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుడిగా మారి తాజాగా తన తండ్రికి రూ.55 లక్షల విలువైన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ సోషల్ మీడియాలో పంచుకున్న ‘శౌర్య శిఖర్’ సక్సెస్ జర్నీ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఈ అద్భుత విజయానికి వెనుక ఉన్న గతాన్ని పరిశీలిస్తే ఎన్నో కన్నీళ్లు కనిపిస్తాయి. శౌర్య తండ్రి స్వయంగా ఒక ఐఐటీ పూర్వ విద్యార్థి. ఆ కారణంగా శౌర్యపై ఇంట్లో తీవ్రమైన ఒత్తిడి ఉండేది. తీరా చూస్తే జేఈఈ పరీక్షలో అతను ఫెయిల్ అయ్యాడు. ఈ ఓటమి అతణ్ని తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి నెట్టింది. తనపై తనకే నమ్మకం పోయింది. ఇష్టం లేకపోయినా ఓ కాలేజీలో బీబీఏ  డిగ్రీలో చేరాడు. తీవ్ర ఒత్తిడి వల్ల అతని బరువు కూడా 110 కిలోలకు పైగా పెరిగిపోయింది. తలిదండ్రులను తలదించుకునేలా చేశాననే బాధ అతణ్ని రోజూ వేధించేది.

ఆ చీకటి రోజుల్లోనే శౌర్య జీవితంలో ఓ చిన్న మార్పు వచ్చింది. కాలేజీలో చదువుతూనే అతను అంకుర్ వారికూ టీమ్‌లో ఒక సాధారణ ఉద్యోగిగా చేరాడు. అప్పట్లో తన భవిష్యత్తుపై అతనికి ఎలాంటి ఆశలు లేవు. కానీ శౌర్య ఎక్కడా ఆగిపోలేదు. రోజూ నిశ్శబ్దంగా కష్టపడుతూనే ఉన్నాడు. తన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకున్నాడు. పట్టుదలగా శ్రమించి బరువు తగ్గించుకుని అత్యంత ఫిట్‌గా మారాడు. అలా ఐదేళ్ల కఠిన శ్రమతో నేడు నెలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని సంపాదించే స్థాయికి ఎదిగాడు. తన తండ్రి రిటైర్మెంట్ కానుకగా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.

ఈ కథ కేవలం డబ్బు, లగ్జరీ కార్ల గురించి కాదని.. ఒడుదుడుకులను ఎదుర్కొని ఎలా నిలబడాలనే దానికి నిదర్శనమని వారికూ పేర్కొన్నారు. మనం నమ్మిన దారిలో ముందుకు సాగితే జీవితం ఏదో ఒక రోజు కచ్చితంగా సెట్ అవుతుందని శౌర్య నిరూపించాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. మనకు అత్యంత దారుణమైన రోజులు ఎదురైనప్పుడు ఆశావాదం కంటే మనం చేసే పనే మనల్ని కాపాడుతుందని కామెంట్లు పెడుతున్నారు. ఒక్క పరీక్ష లేదా ఒక్క రిజెక్షన్ మన భవిష్యత్తును మార్చలేవని, అసలైన కథ ఓటమి తర్వాతే మొదలవుతుందని శౌర్య సక్సెస్ స్టోరీ చాటిచెబుతోంది.
Go Back to Shorts
Shaurya Shikhar
Ankur Warikoo
IIT JEE failure success story
BMW car gift for father
Shaurya Shikhar career growth
Inspirational success stories

More Telugu News