కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ

DK Aruna says Revanth Reddy will meet the same fate as KCR
  • కేసీఆర్ పంథాలోనే రేవంత్ నడుస్తున్నారని ఎద్దేవా
  • పాలమూరు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ధ్వజం
  • జాతీయ హోదాపై కాంగ్రెస్ ఆరోపణల తిరస్కరణ
  • కిషన్‌ రెడ్డిని పొలిమేరల్లోకి రానివ్వబోమన్న రేవంత్‌ వ్యాఖ్యలపై ధ్వజం
  • తెలంగాణ ఏమైనా రేవంత్‌ జాగీరా అంటూ మండిపాటు
పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ ఈ ప్రాంత ప్రాజెక్టుల కోసం పోరాడలేదని విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నడిచిన దారిలోనే రేవంత్ సైతం పయనిస్తున్నారని.. ఆ కారణంగా కేసీఆర్‌కు పట్టిన గతే ఆయనకూ పడుతుందని ఆమె హెచ్చరించారు.

సీఎం రేవంత్‌కు కేవలం ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదని అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టంలో పెట్టలేదని నిలదీశారు.

రాష్ట్ర బీజేపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ పొలిమేర కూడా దాటనివ్వబోమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘పొలిమేర దాటనీయకపోవడానికి తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల మధ్యకు వెళ్లలేకనే చుట్టూ భారీ సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో రేవంత్‌నే తెలంగాణ పొలిమేరల్లోకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అబద్ధాలను గమనిస్తున్నారని అరుణ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. అదే సమయంలో బీజేపీకి ప్రజా మద్దతు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో తదుపరి తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
DK Aruna
Revanth Reddy
Palamuru Rangareddy Lift Irrigation Scheme
Telangana BJP
Telangana Politics
K Chandrashekar Rao

More Telugu News