రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి!

Gulfstream G200 private jet crashes in Dominican Republic
  • డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఘటన
  • క్రాష్ అయి భారీ అగ్నికీలల్లో చిక్కుకున్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్
  • విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి
  • టెక్సాస్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం గుర్తింపు
డొమినికన్ రిపబ్లిక్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికా రిజిస్ట్రేషన్‌తో ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 (Gulfstream G200) ప్రైవేట్ జెట్ విమానం.. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ క్రాష్ అయింది. రన్‌వేపై వేగంగా దూసుకెళ్లిన విమానం ఒక్కసారిగా పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రైవేట్ జెట్ డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా నుంచి అమెరికాలోని టెక్సాస్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, ఎయిర్‌పోర్ట్‌కు నైరుతి దిశలో 16 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం తిరిగి లా రొమానా ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి అనుమతి కోరారు. రన్‌వే 29పై ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలిపోయింది

విచారణ ప్రారంభించిన అధికారులు
ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించినట్లు డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇనిస్టిట్యూట్ (IDAC) నిర్ధారించింది. ఈ ఫ్లైట్‌లో ఎలాంటి ప్రయాణికులు లేరని, ఇది కేవలం పొజిషనింగ్ (Ferry Flight) ఫ్లైట్ మాత్రమేనని అధికారులు తెలిపారు. విమానం వేగంగా దూసుకుపోతూ పేలిపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి.

ప్రమాదానికి గురైన గల్ఫ్‌స్ట్రీమ్ G200 విమానాన్ని 2004లో తయారు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం చాలా స్పష్టంగా ఉందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విమానంలోని ఇంజన్ లేదా హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ డేటాను, మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Gulfstream G200
Dominican Republic plane crash
La Romana International Airport
Private jet explosion
Pilot deaths
Aviation accident

More Telugu News