ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నిర్మలా సీతారామన్‌తో భేటీ, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ
Add ap7am to your home Screen

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నిర్మలా సీతారామన్‌తో భేటీ, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ

CM Chandrababu in Delhi Meets Nirmala Sitharaman Discusses State Projects
  • ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ
  • రెండు రోజుల పర్యటనలో ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం
  • విశాఖ మెట్రో, పోలవరం, పుష్కరాల నిధులపై విజ్ఞప్తి చేసే అవకాశం
  • రేపు సీఐఐ సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విషయంలో జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్రమంత్రికి వివరించారు.  జీహెచ్ హెచ్ ప్రారంభోత్సవానికి వచ్చి ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కేంద్రమంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఎయిడెడ్ ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలకు సంబంధించిన అంశంపైనా వారు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'విజయవాడ ఉత్సవ్'కు రావాలంటూ నిర్మలను చంద్రబాబు ఆహ్వానించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఈ పర్యటనలో భాగంగా విశాఖ మెట్రో రైల్, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు అనుమతులు, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక నిధులు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర సహకారం వంటి అంశాలపై చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. వీటితో పాటు గోదావరి వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై కూడా చర్చించనున్నారు.

రేపు (అక్టోబర్ 8) మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్‌లో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రేపు రాత్రికి ఆయన తిరిగి అమరావతికి రానున్నారు. ఇదే సందర్భంగా, ప్రధాని మోదీ 25 ఏళ్లుగా నిరంతరాయంగా కార్యనిర్వాహక పదవుల్లో కొనసాగుతున్నందుకు చంద్రబాబు ఆయన నాయకత్వ పటిమను ప్రశంసించారు. స్పష్టమైన దార్శనికత, నిజాయతీ, క్రమశిక్షణే ఆయన విజయానికి కారణమని పేర్కొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Nirmala Sitharaman
Andhra Pradesh Projects
Delhi Visit
Rayalaseema Horticulture Hub
Visakhapatnam Metro Rail

More Telugu News