పెట్రోల్ బంక్ సీల్ వివాదం: అధికారిని పొడిచి చంపిన నిర్వాహకుడి కుమారుడు
Add ap7am to your home Screen

పెట్రోల్ బంక్ సీల్ వివాదం: అధికారిని పొడిచి చంపిన నిర్వాహకుడి కుమారుడు

Mahesh Shelke IOCL official stabbed 7 times to death over petrol pump sealing dispute
  • మహారాష్ట్రలో విధి నిర్వహణలో ఉన్న ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య
  • పెట్రోల్ పంప్ సీల్ చేస్తుండగా నిర్వాహకుడి కుమారుడి కత్తితో దాడి
  • అధికారిని ఏడుసార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతి
  • ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు, కేసు నమోదు
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హింగోలి జిల్లాలో ఓ పెట్రోల్ పంప్‌ను సీల్ చేసేందుకు వెళ్లిన సేల్స్ మేనేజర్ మహేశ్ షెల్కేను పంపు నిర్వాహకుడి కుమారుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హింగోలి జిల్లా చొంధి ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సాంకేతిక కారణాలతో మూడు నెలలుగా మూతపడింది. మంగళవారం సాయంత్రం, మహేశ్ షెల్కే తన బృందంతో కలిసి నిబంధనల ప్రకారం ఆ పంపును సీల్ చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో, పంప్ ఆపరేటర్ సాహెబ్ రావ్ పాండవ్‌వీర్ కుటుంబ సభ్యులు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు నెల రోజుల గడువు కోరారు. అందుకు అధికారులు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలోనే ఆపరేటర్ కుమారుడు ఉమేశ్ పాండవ్‌వీర్, మహేశ్ షెల్కేపై కత్తితో దాడి చేసి పొట్ట, వీపు, ముఖంపై ఏడుసార్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో షెల్కే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం నిందితుడు, మరికొందరు రెండు కార్లలో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కురుంద పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అర్విందర్ సింగ్ సహనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "విధి నిర్వహణలో ఉన్న మా సహోద్యోగి మహేశ్ షెల్కే దారుణ హత్యకు గురవడం తీవ్రంగా కలచివేసింది. ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఉన్నతాధికారులను కోరాం" అని ఆయన తెలిపారు.

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన, ఆమోదయోగ్యం కాని హింసాత్మక చర్య అని అభివర్ణించారు. "నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడాం. దేశానికి సేవ చేస్తున్న ఇంధన రంగ సిబ్బంది భద్రత, గౌరవం మాకు చాలా ముఖ్యం" అని మంత్రి పేర్కొన్నారు. షెల్కే కుటుంబానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఆయిల్ తరపున పూర్తి మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
Mahesh Shelke
Indian Oil Corporation
Hingoli petrol pump murder
Maharashtra crime news
Hardeep Singh Puri

More Telugu News