150 కి.మీ వేగంతో బంతులు.. హెల్మెట్ లేకుండా ఎలా ఆడారు?.. గవాస్కర్ ఫన్నీ రిప్లై!
Add ap7am to your home Screen

150 కి.మీ వేగంతో బంతులు.. హెల్మెట్ లేకుండా ఎలా ఆడారు?.. గవాస్కర్ ఫన్నీ రిప్లై!

Sunil Gavaskar funny reply on playing 150 kmph balls without helmet
  • కపిల్ శర్మ షోలో పాత జ్ఞాపకాలు పంచుకున్న గవాస్కర్
  • హెల్మెట్ లేకుండా 150 కి.మీ వేగంతో బంతులను ఎదుర్కొన్న వైనం
  • 'అప్పుడు బుర్రలో ఏమీ లేదు' అంటూ సరదాగా వ్యాఖ్యానించిన స‌న్నీ
  • స‌న్నీతో పాటు కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన రవిశాస్త్రి, సిద్ధూ
  • కపిల్ దేవ్‌ గెటప్‌లో నవ్వులు పూయించిన కమెడియన్ సునీల్ గ్రోవర్
భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన ఆరంభ రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అందరినీ నవ్వించాడు. హెల్మెట్ లేకుండానే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న రోజుల గురించి స‌న్నీ పంచుకున్న అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రవిశాస్త్రితో కలిసి గవాస్కర్ ఇటీవల 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో' సీజన్ 5లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చేసిన సరదా వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. 

కార్యక్రమంలో భాగంగా హోస్ట్ కపిల్ శర్మ ఆనాటి భీకరమైన వెస్టిండీస్ జట్టు ఫొటోను చూపిస్తూ.. "ఆ రోజుల్లో ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా, ముఖ్యంగా హెల్మెట్ లేకుండా అంత వేగవంతమైన బౌలర్లను ఎలా ఎదుర్కొన్నారు?" అని గవాస్కర్‌ను ప్రశ్నించారు. అప్పట్లో బంతులు గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చేవని గుర్తుచేసుకున్న గవాస్కర్.. "అందర్ భేజే మే కుచ్ నహీ థా" (అప్పుడు బుర్రలో ఏమీ లేదు.. తగిలితే ఏమవుతుంది.. బుర్రలో ఏదైనా ఉంటే కదా భయపడాలి!) అంటూ చమత్కరించాడు. స‌న్నీ సమాధానంతో షోలో నవ్వులు పూశాయి.

ఈ సంభాషణ పాతతరం క్రికెటర్ల జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. దేశం కోసం ఆడటమే గొప్ప గౌరవంగా భావించేవాళ్లమని, అతి తక్కువ రక్షణ పరికరాలతోనే భయంకరమైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నామని గవాస్కర్ వివరించాడు. కేవలం 38 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు ఎందుకు వీడ్కోలు పలికాడో కూడా తెలియ‌జేశాడు. ఐపీఎల్‌ రాకతో క్రికెట్‌లో వచ్చిన మార్పులపైనా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ఈ షోకు రవిశాస్త్రి తొలిసారిగా హాజరుకావడం విశేషం. మరోవైపు ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక, నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా తన కెరీర్ తొలిరోజుల్లో వచ్చిన అలవెన్సులతో హెల్మెట్ కొనుక్కున్న విషయాన్ని, రవిశాస్త్రితో రూమ్ షేర్ చేసుకున్న నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్, క్రికెట్ పాత జ్ఞాపకాలు, లాకర్ రూమ్ కథలు, కామెడీల కలబోతగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
Advertisement
Sunil Gavaskar
The Great Indian Kapil Sharma Show
Ravi Shastri
West Indies fast bowlers
Sunil Gavaskar funny reply
Cricket history memories

More Telugu News