‘చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది’.. అగార్కర్‌కు గంభీర్‌ ఎమోషనల్‌ మెసేజ్‌
Add ap7am to your home Screen

‘చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది’.. అగార్కర్‌కు గంభీర్‌ ఎమోషనల్‌ మెసేజ్‌

Ajit Agarkar will be remembered by history says Gautam Gambhir in emotional post
  • అగార్కర్‌కు గంభీర్‌ ఘన వీడ్కోలు
  • చరిత్ర అగార్కర్‌ను గొప్పగా గుర్తుంచుకుంటుందని వ్యాఖ్య
  • అతడి హయాంలో భారత్‌ మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచినట్లు గుర్తు చేసిన వైనం
  • మంగళవారంతో ముగిసిన అగార్కర్‌ పదవీకాలం
  • తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రజ్ఞాన్‌ ఓజా
టీమిండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కు భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఘనంగా వీడ్కోలు పలికాడు. అగార్కర్‌ హయాంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడాన్ని గుర్తు చేసుకున్న గంభీర్‌.. భవిష్యత్తులో చరిత్ర అతడిని మరింత గొప్పగా గుర్తుంచుకుంటుందని పేర్కొన్నాడు.

‘‘అజిత్‌ భాయ్‌.. మీతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మీ హయాంలో సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీలే మీ నమ్మకానికి నిదర్శనం. ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. చరిత్ర మిమ్మల్ని మరింత గొప్పగా గుర్తుంచుకుంటుంది. ధన్యవాదాలు. మీ భవిష్యత్తుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని గంభీర్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశాడు.

2023 జులైలో అగార్కర్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి హయాంలో భారత్‌ 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచకప్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌ సాధించింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు జట్లను ఎంపిక చేయడం అగార్కర్‌ చేపట్టిన చివరి బాధ్యతగా నిలిచింది.

అగార్కర్‌ పదవీకాలం మంగళవారంతో అధికారికంగా ముగిసింది. ఖాళీ అయిన సెలెక్టర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

ప్రస్తుతం మాజీ భారత స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, భారత్‌-ఏ జట్టుకు సంబంధించిన మూడు మ్యాచ్‌ల కోసం జట్ల ఎంపికలో అతడు పాల్గొన్నాడు. సెలెక్షన్‌ ప్యానెల్‌లో ఓజాతో పాటు శివసుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రా, ఆర్పీ సింగ్‌ ఉన్నారు.

కొత్త సెలెక్టర్‌ కోసం అక్టోబర్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థి కనీసం ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. మరో నిబంధన ప్రకారం ఐదు సంవత్సరాల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఉండాలి.
Advertisement
Ajit Agarkar
Gautam Gambhir
BCCI Chief Selector
Indian Cricket Team
ICC Trophies
Pragyan Ojha

More Telugu News