కొచ్చిలో నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
Advertisement

కొచ్చిలో నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

Telugu people give Nara Lokesh a warm welcome in Kochi
  • సౌత్ ఇండియా సదస్సు కోసం కేరళలోని కొచ్చికి మంత్రి లోకేశ్
  • ఏపీ ప్రగతి పథంపై సదస్సులో కీలక ప్రసంగం చేయనున్న లోకేశ్
  • పాలన, విద్య, ఉపాధి అవకాశాలపై చర్చించనున్నట్లు వెల్లడి
  • కొచ్చిలో తెలుగు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించిందన్న మంత్రి
  • రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ కేరళలోని కొచ్చి చేరుకున్నారు. కొచ్చి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 'ఇండియా టుడే సౌత్ ఇండియా సమ్మిట్'లో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వచ్చారు. ఈ సదస్సులో ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రగతి ప్రస్థానంపై కీలక ప్రసంగం చేయనున్నారు.

“ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానం – పాలన, అభివృద్ధి, విద్య, ప్రపంచ స్థాయి లక్ష్యాలు” అనే అంశంపై మంత్రి లోకేశ్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలన, ఆర్థికాభివృద్ధి, విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలను ఆయన వివరించనున్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఆయన ఈ వేదికపై ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

తన పర్యటనపై మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "కొచ్చిలో అడుగుపెట్టిన నాకు తెలుగు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో పాల్గొంటుండడం సంతోషంగా ఉంది. దక్షిణాదిలో అవకాశాలను తీర్చిదిద్దడంపై జరిగే ఈ చర్చలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కొచ్చిలో లోకేశ్ కు స్వాగతం పలికిన వారిలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తనయుడు నిఖిల్ కూడా ఉన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ, పారిశ్రామిక, విద్యా రంగ నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ విధానాలను, అభివృద్ధి నమూనాను జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ సదస్సులో మంత్రి లోకేశ్ ప్రసంగంపై రాష్ట్రంలోని రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Advertisement
Nara Lokesh
India Today South India Summit
Kochi Kerala
Andhra Pradesh Development
Telugu People Kochi
South India Conclave

More Telugu News