ఇక్కడున్నది మోదీ-చంద్రబాబు-పవన్ అని గుర్తుంచుకోవాలి: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
Advertisement

ఇక్కడున్నది మోదీ-చంద్రబాబు-పవన్ అని గుర్తుంచుకోవాలి: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

Chandrababu Naidu says ours is coronation for poor theirs is bloodbath of destruction
  • మోదీ సహకారం, పవన్ హుషారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న చంద్రబాబు
  • గత ప్రభుత్వ హయాంలో 880 కి.మీ. సీసీ రోడ్లు వేశారన్న చంద్రబాబు
  • మేం రెండేళ్లలో 6,500 కి.మీ. వేశామని వెల్లడి
  • అభివృద్ధికి అడ్డుపడితే ఎంతమాత్రం సహించబోమని హెచ్చరిక
  • స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయం ఖాయమన్న చంద్రబాబు
కూటమి ప్రభుత్వం పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే, మరికొందరు విధ్వంసంతో రక్తాభిషేకం చేస్తామంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించే ప్రసక్తి లేదని, ఇక్కడ ఉన్నది మోదీ, చంద్రబాబు, పవన్ అని గుర్తుంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రత్యర్థులను హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలోని విధ్వంసానికి, నేటి కూటమి ప్రభుత్వ వికాసానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'పల్లె పండుగ-3.0' బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, తన అనుభవం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుషారుతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రక విజయాన్ని అందించారని, ప్రస్తుతం ఆ ప్రజాదరణ మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమిదే ఘనవిజయమని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పల్లెలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కనీస సౌకర్యాల కల్పనకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొందని విమర్శించారు.

గత ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, తమ ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 6,500 కిలోమీటర్ల రోడ్లను నిర్మించిందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం, ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ, 'సూపర్ సిక్స్' వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
Palle Panduga
Pawan Kalyan
Narendra Modi
Udayagiri

More Telugu News