నా భర్త ఎందుకు అలా చేశాడో తెలియదు: మామ హత్య కేసులో విడుదలైన షాలూ ఆవేదన
Advertisement

నా భర్త ఎందుకు అలా చేశాడో తెలియదు: మామ హత్య కేసులో విడుదలైన షాలూ ఆవేదన

Shalu Manocha released after 21 days in father-in-law murder case
  • 21 రోజుల పాటు జైల్లో నరకయాతన అనుభవించానన్న షాలూ
  • కొడుకు గురించే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపానని ఆవేదన
  • ఆస్తి కోసం తండ్రిని చంపేందుకు భర్త సుబ్రత్ ప్లాన్ చేసినట్లు గుర్తింపు
  • భార్యపై నెపం నెట్టేందుకు సుబ్రత్ ప్రయత్నించాడని తేల్చిన పోలీసులు
తన మామ హత్య కేసులో భర్తే తనను అన్యాయంగా ఇరికించాడని, అతను తనపై ఎందుకు ఆరోపణలు చేశాడో ఇప్పటికీ అర్థం కావడం లేదని షాలూ ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వినీత్ మినోచా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొని 21 రోజులు జైలు జీవితం గడిపిన ఆమె, పోలీసులు నిర్దోషిగా తేల్చడంతో సోమవారం రాత్రి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె, తన భర్త ప్రవర్తన పట్ల దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, కాన్పూర్‌లోని ఇందిరా నగర్‌లో ఉన్న రతన్ ఆర్బిట్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ సి-104లో నివసిస్తున్న ఔషధ వ్యాపారి వినీత్ మినోచా (60) సెప్టెంబర్ 5న దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయనను 17 సార్లు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వినీత్ కోడలు షాలూ, కొడుకు సుబ్రత్, మాజీ పనిమనిషి విశాల్‌ను విచారించారు. డబ్బు వివాదాలు, కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు, మొదట షాలూను నిందితురాలిగా పేర్కొని అరెస్టు చేశారు.

దీంతో ఆమె 21 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది. అయితే, తదుపరి దర్యాప్తులో షాలూ పాత్ర ఏమీ లేదని పోలీసులకు స్పష్టమైంది. ఈ కేసులో అసలు హంతకుడు వినీత్ కొడుకు సుబ్రత్ అని తేల్చారు. తండ్రిని హత్య చేసేందుకు సుబ్రత్ తన మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్, అతని స్నేహితుడు రాజ్‌కిశోర్‌కు సుపారీ ఇచ్చాడని పోలీసులు కనుగొన్నారు. దీంతో సెప్టెంబర్ 24న సుబ్రత్‌ను అరెస్టు చేశారు. తన తండ్రికి అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఆస్తి గొడవలు వస్తాయనే భయంతోనే ఈ హత్య చేయించినట్లు సుబ్రత్ మీడియా ముందు అంగీకరించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడంతో, షాలూను తక్షణమే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం షాలూ మీడియాతో మాట్లాడుతూ, "నేను నిర్దోషినని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నిజం అందరి ముందు ఉంది. కానీ, నా భర్త సుబ్రత్ నాపై ఎందుకు ఆరోపణలు చేశాడో నాకు తెలియడం లేదు. 21 రోజులు జైల్లో చాలా నరకం అనుభవించాను. ఇప్పుడు నేరుగా నా కొడుకు దగ్గరికే వెళ్లాలనుకుంటున్నాను" అని భావోద్వేగంతో చెప్పారు.

షాలూ సోదరుడు ధీరజ్ అరోరా మాట్లాడుతూ, ఏ పోలీసులైతే ఆమెను అరెస్టు చేశారో, వారే ఆమె నిర్దోషి అని చెప్పారని తెలిపారు. షాలూ తన అత్తవారింటికి కాకుండా, ప్రస్తుతం తన కుమారుడు శ్రీజయ్ ఉంటున్న లక్నోలోని పుట్టింటికి వెళ్లనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్యాప్తు అధికారి లేదా కోర్టు పిలిచినప్పుడు హాజరుకావాలనే షరతుపై ఆమెను విడుదల చేశారు.
Advertisement
Shalu Manocha
Vineet Manocha murder case
Kanpur crime news
Subrat Manocha arrest
Pharma businessman murder

More Telugu News