స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ ఉక్కుపాదం.. ఫిర్యాదు లేకుండానే చర్యలు!
Advertisement

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ ఉక్కుపాదం.. ఫిర్యాదు లేకుండానే చర్యలు!

TRAI crackdown on spam calls action without complaints
  • స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ కఠిన నిబంధనలు
  • ఫిర్యాదు లేకున్నా ఏఐ సాయంతో స్పామర్లను గుర్తించనున్న టెల్కోలు
  • తొలిసారి పట్టుబడితే 15 రోజులు ఔట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేత
  • పదేపదే చేస్తే ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్, కొత్త కనెక్షన్ బంద్
అనవసర స్పామ్ కాల్స్‌తో విసిగిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందకపోయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత సాయంతో స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు 'టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్'లో నూతన నిబంధనలను పొందుపరిచింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, టెలికాం కంపెనీలు తమ ఏఐ లేదా మెషీన్ లెర్నింగ్ వ్యవస్థల ద్వారా ఏదైనా కాల్‌ను స్పామ్‌గా గుర్తిస్తే, ఆ సమాచారాన్ని రెండు గంటల్లోపు సంబంధిత ఆపరేటర్‌కు నివేదించాలి. సదరు ఆపరేటర్ ఒక పనిదినం వ్యవధిలో ఆ నంబర్‌కు సంబంధించిన కేవైసీ వివరాలను సేకరించి, ఇతర టెలికాం సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుంది. గడిచిన 10 రోజుల్లో ఒకే వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఐదు కంటే ఎక్కువ నంబర్లు స్పామ్‌గా నమోదైతే, అన్ని టెలికాం సంస్థలు సమన్వయంతో కఠిన చర్యలు చేపడతాయి.

స్పామర్లపై కఠిన చర్యలను కూడా ట్రాయ్ ప్రతిపాదించింది. ఏఐ విశ్లేషణలో మొదటిసారి స్పామర్‌గా నిర్ధారణ అయితే, సదరు వ్యక్తి పేరిట ఉన్న అన్ని కనెక్షన్లపై 15 రోజుల పాటు అవుట్‌గోయింగ్ సేవలను నిలిపివేస్తారు. నిబంధనలను అతిక్రమిస్తూ మళ్లీ అదే తప్పు చేస్తే, ఆ నంబర్లను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు. అటువంటి వారికి ఏ టెలికాం సంస్థ కూడా కొత్త కనెక్షన్‌లను జారీ చేయదు.

వినియోగదారుల సౌలభ్యం కోసం మరికొన్ని మార్పులను కూడా ట్రాయ్ సూచించింది. ఇకపై కేవలం ప్రమోషనల్ కాల్స్‌‍ను మాత్రమే నిలిపివేయాలనుకునే వారు, తమ మొబైల్ నుంచి ‘BLOCK PROMO’ అని టైప్ చేసి 1909 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఇప్పటికే ‘FULLY BLOCK’ సేవను పొందుతున్న వినియోగదారులను 15 రోజుల్లోగా నూతన కేటగిరీకి మారుస్తామని ట్రాయ్ వెల్లడించింది. కాగా, ప్రభుత్వం, బ్యాంకులు, అధీకృత సంస్థల నంబర్లను ట్రూకాలర్ వంటి యాప్‌లు స్పామ్‌గా ట్యాగ్ చేయడాన్ని ట్రాయ్ నిషేధించింది.
Advertisement
TRAI
Spam Calls
Artificial Intelligence
Telecom Regulations India
Mobile Users
Spam Call Blocking

More Telugu News