తలనొప్పి వస్తోందా? అసలు కారణం కళ్లలోనే ఉండొచ్చు.. ఈ లక్షణాలు గమనించండి!

తలనొప్పి వస్తోందా? అసలు కారణం కళ్లలోనే ఉండొచ్చు.. ఈ లక్షణాలు గమనించండి!

Headache causes and eye related symptoms to watch out for
  • కొన్ని తలనొప్పులకు కంటి సమస్యలే కారణం కావొచ్చంటున్న నిపుణులు
  • పవర్‌ లోపాలు కళ్లపై ఒత్తిడి పెంచుతాయని వివరణ
  • స్క్రీన్‌ ఎక్కువగా చూడటం వల్ల స్ట్రెయిన్‌ పెరుగుతుందని హెచ్చరిక
  • ఎర్రటి కంటితో తీవ్రమైన నొప్పి అత్యవసర హెచ్చరిక అని సూచన
  • 50 తర్వాత కొత్త తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిక
తలనొప్పి రాగానే చాలామంది ఒత్తిడి, ఎక్కువసేపు ఫోన్‌ చూడటం, నిద్ర సరిగ్గా లేకపోవడం.. ఇలా కారణాలు వెతుకుతారు. కానీ కొన్ని సందర్భాల్లో తలనొప్పికి అసలు కారణం కళ్లే కావచ్చు. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. చూపు సరిగా లేకపోవడం నుంచి కంటి నరాల సమస్యలు, కంటి ఒత్తిడి పెరగడం వరకు పలు కారణాలు తలనొప్పికి దారితీస్తాయి. అయితే ప్రతి తలనొప్పినీ కంటి సమస్యగా భావించాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

చూపు లోపాలు, స్క్రీన్‌ స్ట్రెయిన్‌
మయోపియా, హైపర్‌మెట్రోపియా, ఆస్టిగ్మాటిజం వంటి కంటిచూపు లోపాలు సరిచేయకపోతే కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రానికి నుదురు భాగంలో నొప్పి ఎక్కువ కావచ్చు. ఆస్టిగ్మాటిజం స్వల్పంగా ఉన్నా కంటిపై ఒత్తిడి పెరగొచ్చు. గంటల తరబడి స్క్రీన్‌ చూడటం వల్ల రెప్పలు తక్కువగా కొట్టడం, కళ్లలో పొడిబారడం, ఫోకస్‌ చేసే కండరాలపై ఒత్తిడి పెరగడం కూడా తలనొప్పికి కారణమవుతాయి.

చదివేటప్పుడు తలనొప్పి వస్తోందా?
దగ్గరగా చదివేటప్పుడు రెండు కళ్లూ సమన్వయంతో పనిచేయాలి. ఈ సమన్వయం సరిగా లేకపోతే రోజంతా పని చేసిన తర్వాత తలనొప్పి పెరగొచ్చు. కొన్నిసార్లు అక్షరాలు రెండుగా కనిపించవచ్చు. చదివేటప్పుడు ఒక కన్ను మూసుకుంటేనే సౌకర్యంగా అనిపిస్తే కంటి సమన్వయ సమస్య ఉండే అవకాశం ఉంది.

మైగ్రేన్‌ నుంచి గ్లకోమా వరకు
తలనొప్పికి ముందు మెరుపులు, జిగ్‌జాగ్‌ గీతలు, కొద్దిసేపు చూపు తగ్గినట్లు అనిపించడం సాధారణంగా విజువల్‌ ఆరా కావచ్చు. ఇది కంటి వ్యాధి కాకుండా నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణం కావచ్చు. సాధారణంగా ఇది 20-30 నిమిషాల్లో తగ్గిపోతుంది.

అయితే ఒక్క కంటిలో తీవ్రమైన నొప్పి, కన్ను ఎర్రబడటం, చూపు మసకబారడం, లైట్ల చుట్టూ వలయాలు కనిపించడం, వాంతులు ఉంటే మాత్రం అత్యవసరంగా వైద్యులను సంప్రదించాలి. ఇవి అక్యూట్‌ యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా లక్షణాలు కావచ్చు. చికిత్స ఆలస్యమైతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.

కంటి నరాల సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు
కదిలించినప్పుడు కంటిలో నొప్పి, ఆ తర్వాత ఒక కంటిలో చూపు మసకబారడం లేదా తగ్గడం ఉంటే ఆప్టిక్‌ న్యూరైటిస్‌ కారణం కావచ్చు. రంగులు కూడా సరిగా కనిపించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది మల్టిపుల్‌ స్క్లీరోసిస్‌ వంటి నాడీ సంబంధిత సమస్యలకు తొలి సంకేతంగా ఉండొచ్చు.

మెదడులో ఒత్తిడి పెరిగినప్పుడు ఆప్టిక్‌ నరం ఉబ్బడాన్ని పాపిల్లీడిమా అంటారు. ఉదయం లేవగానే లేదా పడుకున్నప్పుడు తలనొప్పి ఎక్కువ కావడం, దగ్గినప్పుడు నొప్పి పెరగడం, నిలబడినప్పుడు కొద్దిసేపు చూపు మసకబారడం, చెవుల్లో గాలి ఊదినట్లు శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

50 ఏళ్లు దాటిన తర్వాత తలనొప్పి వస్తే..
50 ఏళ్లు దాటిన తర్వాత కొత్తగా తలనొప్పి రావడం, తలపై చర్మాన్ని తాకితే నొప్పిగా అనిపించడం, నమిలేటప్పుడు దవడ నొప్పి రావడం ఉంటే జెయింట్‌ సెల్‌ ఆర్థరైటిస్‌ కూడా కారణం కావచ్చు. ఈ సమస్యకు వెంటనే చికిత్స అవసరం. ఆలస్యమైతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.

సైనసైటిస్‌ వల్ల కూడా కళ్ల చుట్టూ నొప్పి రావచ్చు. ముందుకు వంగినప్పుడు నొప్పి పెరగడం, ముక్కు దిబ్బడ ఉండటం దీనికి సూచనలు. డ్రై ఐ, కనురెప్పల అంచుల్లో వాపు వంటి సమస్యలు కూడా కంటి ఒత్తిడిని పెంచి తలనొప్పికి దోహదం చేయొచ్చు.

తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలి?
కంటి పవర్‌ను ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. ముఖ్యంగా చదివేటప్పుడు లేదా స్క్రీన్‌ చూస్తున్నప్పుడు మాత్రమే తలనొప్పి వస్తే కళ్ల ఫోకస్‌, రెండు కళ్ల సమన్వయాన్ని కూడా పరీక్షించుకోవాలి. స్క్రీన్‌ వాడేటప్పుడు 20-20-20 నియమం పాటించడం, తరచూ రెప్పలు కొట్టడం, సరైన దూరంలో స్క్రీన్‌ ఉంచడం ఉపయోగపడతాయి.
Advertisement
Headache
Eye Strain
Vision Problems
Glaucoma Symptoms
Digital Eye Strain
Optic Neuritis

More Telugu News