తండ్రి పేరుతో వచ్చే ఒత్తిడిని పట్టించుకోను.. నా ఆట నేను ఆడతా: సెహ్వాగ్ కుమారుడు

తండ్రి పేరుతో వచ్చే ఒత్తిడిని పట్టించుకోను.. నా ఆట నేను ఆడతా: సెహ్వాగ్ కుమారుడు

Aryavir Sehwag says I will play my game and ignore pressure of my fathers name
  • ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియాపై ఆర్యవీర్ సెహ్వాగ్ అరంగేట్రం
  • బ్యాటింగ్‌ను సింపుల్‌గా ఉంచుకోమని తండ్రి సలహా ఇచ్చాడ‌ని వెల్లడి
  • భారీ స్కోర్లు సాధిస్తేనే క్రికెట్‌లో గుర్తింపు వస్తుందని వ్యాఖ్య
భారత క్రికెట్‌లో డాషింగ్ ఓపెనర్‌గా పేరొందిన‌ వీరేంద్ర సెహ్వాగ్ వారసుడు ఇప్పుడు మైదానంలోకి అడుగుపెట్టాడు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఆయన పెద్ద కుమారుడు 18 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో ఆర్యవీర్ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి 28, 47, 34 పరుగులు సాధించాడు. అంతకుముందు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

ఈ సందర్భంగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన ఆర్యవీర్, తన ప్రదర్శనపై కొంత నిరాశ వ్యక్తం చేశాడు. "మూడు మ్యాచ్‌లలోనూ మంచి ఆరంభాలు లభించినా, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాను. చివరి గేమ్‌లో కూడా కుదురుకున్నాక సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాను. ఇది నన్ను నిరాశపరిచింది. క్రికెట్‌లో పేరు సంపాదించాలంటే భారీ పరుగులు చేయడం చాలా ముఖ్యం. ఇన్నింగ్స్‌ను దశలవారీగా విభజించుకుని ముందుకు సాగాలని నేర్చుకున్నాను" అని తెలిపాడు.

ప్రఖ్యాత ఇంటిపేరుతో వచ్చే ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. ఆర్యవీర్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చాడు. "నా ఇంటిపేరు, మా నాన్న సాధించిన విజయాల గురించి నేను ఎంతో గర్వపడతాను. ఆయన పేరు వల్ల నాపై ఎలాంటి ఒత్తిడి, భారం లేదు. ప్రశంసలు, విమర్శలను పట్టించుకోకుండా నా ఆటపై, నా ప్రక్రియపై మాత్రమే దృష్టి పెట్టేలా మైండ్‌సెట్ క్రియేట్ చేసుకుంటున్నాను. అదే నాకు మంచిది" అని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్ అనుభవం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆర్యవీర్ చెప్పాడు. "అరంగేట్రం మ్యాచ్‌కు ముందు కొంచెం నర్వస్‌గా ఉన్నాను. ఆస్ట్రేలియా బౌలర్లు మంచి వేగంతో బౌలింగ్ చేశారు. వారిని ఎదుర్కోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది" అని అన్నాడు.

తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చే సలహాల గురించి కూడా ఆర్యవీర్ పంచుకున్నాడు. "నాన్న నాకు ఎప్పుడూ బ్యాటింగ్‌ను చాలా సింపుల్‌గా ఉంచుకోమని చెబుతారు. 'కొట్టగల బంతిని కొట్టు, వదిలేయగలిగేదాన్ని వదిలేయ్, డిఫెండ్ చేయాల్సి వస్తే డిఫెండ్ చెయ్' అని సలహా ఇస్తారు. సోషల్ మీడియాలో చాలా మాటలు వినిపిస్తుంటాయి కాబట్టి, టెక్నిక్ కంటే మానసిక దృఢత్వంపై ఎక్కువ దృష్టి పెట్టమని చెబుతారు" అని వెల్లడించాడు. తాను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానినని, ఆయన్ను రెండు, మూడు సార్లు కలిశానని ఆర్యవీర్ తెలిపాడు.
Advertisement
Aryavir Sehwag
Virender Sehwag
India Under-19 cricket team
Australia Youth ODI series
Virat Kohli fan
Delhi Premier League

More Telugu News