పొరపాటా? కుట్రా?.. చైనా చేతిలో అమెరికా ఎఫ్-35 యుద్ధవిమాన విడిభాగాలు!

పొరపాటా? కుట్రా?.. చైనా చేతిలో అమెరికా ఎఫ్-35 యుద్ధవిమాన విడిభాగాలు!

F35 Fighter Jet parts reach China by mistake or conspiracy
  • అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమాన భాగాలను స్వాధీనం చేసుకున్న చైనా
  • ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వెళుతుండగా హాంకాంగ్‌కు మళ్లిన షిప్‌మెంట్
  • స్టెల్త్ టెక్నాలజీ ఉన్న కాక్‌పిట్, వెపన్స్-బే డోర్ చైనా చేతికి చిక్కిన వైనం
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్న అమెరికా, ఆస్ట్రేలియా
  • ఈ విషయం తమకు తెలియదని ప్రకటించిన చైనా విదేశాంగ శాఖ
అమెరికా రక్షణ రంగాన్ని, ప్రపంచ భద్రతా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యంత ఆధునాతనమైన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానానికి చెందిన కీలకమైన విడిభాగాలు చైనా చేతికి చిక్కాయి. ఆస్ట్రేలియా నుంచి మరమ్మతుల కోసం అమెరికాకు పంపిన ఈ భాగాలు, హాంకాంగ్‌కు దారి మళ్లడంతో అక్కడి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇది పొరపాటున జరిగిందా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియా సైన్యానికి చెందిన ఒక ఎఫ్-35 విమానం కాక్‌పిట్ కెనోపీ (cockpit canopy), ఆయుధాలను అమర్చే వెపన్స్-బే డోర్‌ను (weapons-bay door) మే నెల చివరలో యూపీఎస్ కొరియర్ ద్వారా అమెరికాకు పంపారు. విమానానికి స్టెల్త్ సామర్థ్యాన్ని అందించే రాడార్-శోషక పూత (radar-absorbing material) వీటికి ఉండటమే అత్యంత కీలకమైన విషయం. ఈ షిప్‌మెంట్, దక్షిణ కొరియా మీదుగా ప్రయాణిస్తూ అనూహ్యంగా హాంకాంగ్‌కు చేరింది. ఎందుకు దారి మళ్లిందనే దానిపై స్పష్టత లేదు. హాంకాంగ్‌లో ఈ పార్శిల్స్‌ను చైనా అధికారులు స్వాధీనం చేసుకుని, ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు.

ఈ ఘటనపై అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ స్పందించింది. పనిచేయని ఎఫ్-35 భాగాల రవాణాలో సమస్య తలెత్తిన విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని తిరిగి పొందేందుకు, ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. విమాన తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ మాత్రం... ఇవి పనిచేయనివని, వీటివల్ల ప్రమాదం తక్కువేనని పేర్కొంది. రవాణా మార్గాన్ని రక్షణ శాఖనే ఎంపిక చేసిందని స్పష్టం చేసింది. అటు ఆస్ట్రేలియా కూడా ఈ ఘటనపై తమ వైపు నుంచి దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించింది.

అయితే, ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ మాత్రం 'తమకు సమాచారం లేదని' చెప్పడం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కోసం యూఎస్ వెళ్లిన తరుణంలోనే ఈ వ్యవహారం బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. F-35 టెక్నాలజీని దొంగిలించేందుకు చైనా చాలాకాలంగా గూఢచర్య ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

నిపుణుల ప్రకారం, ఈ భాగాలు 'పనిచేయనివి' అయినప్పటికీ, వాటిపై ఉన్న స్టెల్త్ పూతను విశ్లేషించడం ద్వారా చైనా తన సొంత టెక్నాలజీని మెరుగుపరుచుకునే ప్రమాదం ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎఫ్-35 విమానాలకు ఆస్ట్రేలియా ఒక ప్రధాన నిర్వహణ కేంద్రంగా ఉన్నందున, ఈ భద్రతా వైఫల్యం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. యూఎస్ కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ అంశంపై సమీక్ష జరుపుతున్నాయి.


Advertisement
F-35 Fighter Jet
US China Defense Conflict
Lockheed Martin
Pentagon Investigation
Stealth Technology
Hong Kong Customs

More Telugu News