ముందస్తు విడుదలకు నో.. అబూ సలేం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ముందస్తు విడుదలకు నో.. అబూ సలేం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismisses Abu Salem petition for early release
  • ముందస్తు విడుదలకు అబూ సలేంకు సుప్రీంలో చుక్కెదురు
  • రెమిషన్‌ను పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలన్న అభ్యర్థన తిరస్కరణ
  • 25 ఏళ్ల శిక్షను తగ్గించలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం
  • భారత్-పోర్చుగల్ ఒప్పందం ప్రకారమే శిక్ష ఉంటుందని వెల్లడి
  • 2030 నవంబర్ వరకు జైలులోనే ఉండనున్న అబూ సలేం
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందని, సత్ప్రవర్తన కింద లభించిన రెమిషన్ (శిక్షా కాలం తగ్గింపు) కూడా పరిగణనలోకి తీసుకుని తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. ఈ విషయంలో గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పును వెలువరించింది. పోర్చుగల్‌కు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తనకు 25 ఏళ్లకు మించి శిక్ష విధించరాదని, విచారణ ఖైదీగా ఉన్న కాలాన్ని, రెమిషన్‌ను కూడా కలిపి లెక్కిస్తే తన శిక్షాకాలం పూర్తయినట్లేనని సలేం తన పిటిషన్‌లో వాదించాడు. ప్రస్తుతం నాసిక్ రోడ్ సెంట్రల్ జైలులో ఉన్న సలేం, బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన అబూ సలేంను 2005 నవంబర్‌లో పోర్చుగల్ నుంచి భారత్‌కు అప్పగించారు. ఈ కేసులో విచారణ జరిపిన ప్రత్యేక టాడా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే, పోర్చుగల్‌కు ఇచ్చిన హామీని దృష్టిలో ఉంచుకుని, 2022 జులైలో సుప్రీంకోర్టు ఆ జీవిత ఖైదును 25 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. ఈ 25 ఏళ్ల శిక్ష పూర్తవడానికి ఒక నెల ముందు రెమిషన్ అంశాన్ని పరిశీలించాలని కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన 25 ఏళ్ల శిక్షను జైలు నిబంధనల ప్రకారం లభించే సాధారణ రెమిషన్లతో తగ్గించలేమని బాంబే హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇది కోర్టు విధించిన అసలైన శిక్ష అని, రెమిషన్లను కలుపుకొని దీనిని తగ్గించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. 

సలేం అరెస్టు అయిన 2005 నవంబర్ 11 నుంచి లెక్కిస్తే.. 25 ఏళ్ల శిక్ష 2030 నవంబర్‌లో పూర్తవుతుందని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, సలేం పిటిషన్‌ను కొట్టివేసింది. తాజా తీర్పుతో అబూ సలేం ముందస్తు విడుదల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అతను 2030 వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
Advertisement
Abu Salem
Supreme Court of India
1993 Mumbai Blasts
Early Release Petition
Portugal Extradition Treaty
Nashik Road Central Jail

More Telugu News