రహదారి నిర్మాణంలో ఆలస్యం.. ప్రారంభోత్సవానికి రాబోనన్న గడ్కరీ

రహదారి నిర్మాణంలో ఆలస్యం.. ప్రారంభోత్సవానికి రాబోనన్న గడ్కరీ

Nitin Gadkari refuses to attend inauguration due to Mumbai Goa highway delay
  • దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ముంబై-గోవా హైవే పనులు
  • ఆలస్యంపై గడ్కరీ తీవ్ర అసంతృప్తి
  • పూర్తయినా ప్రారంభోత్సవానికి రానన్న మంత్రి
  • అక్టోబర్‌లో రోడ్డుమార్గంలో గోవాకు వెళ్లి పరిశీలిస్తానని వెల్లడి
  • ప్రాజెక్టుకు దాదాపు రూ.16 వేల కోట్ల ఖర్చు
ముంబై-గోవా హైవే విస్తరణ పనులు ఏళ్ల తరబడి సాగుతుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 15 ఏళ్లుగా పూర్తికాని ఈ ప్రాజెక్టు విషయంలో తనకు సిగ్గుగా ఉందని అన్నారు. పనులు పూర్తయినా ప్రారంభోత్సవానికి తాను రానని స్పష్టం చేశారు. బదులుగా అక్టోబర్‌లో ముంబై నుంచి గోవాకు రోడ్డుమార్గంలో ప్రయాణించి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తానన్నారు.

పనాజీ సమీపంలోని పొర్వోరిమ్‌లో కొత్తగా నిర్మించిన ఆరు వరుసల ఎలివేటెడ్‌ రోడ్డు కారిడార్‌ను ప్రారంభించిన సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌లో ముంబై విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గోవా వరకు రోడ్డుమార్గంలో వెళ్తానని చెప్పారు. ప్రయాణికులకు రహదారి నిజంగా ఎంత సౌకర్యంగా మారిందో స్వయంగా చూస్తానన్నారు. పనుల్లో జాప్యానికి, నాణ్యత లోపాలకు కారణమైన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు.

15 ఏళ్లుగా సాగుతున్న పనులు
ముంబై-గోవా హైవే విస్తరణ పనులు 2011లో మొదలయ్యాయి. పాత రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలకు విస్తరించి, ముంబై-గోవా ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గించాలన్నది లక్ష్యం. 2016కే పనులు పూర్తికావాల్సి ఉన్నా.. పలుమార్లు గడువులు మారాయి. 485 కిలోమీటర్ల పనుల్లో 465 కిలోమీటర్లు నాలుగు వరుసలుగా పూర్తయ్యాయని ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. మిగిలిన 20 కిలోమీటర్ల పనులకు జూన్‌ 2026 గడువు పెట్టినా అది కూడా దాటిపోయింది. ప్రస్తుతం పనులు 93-94 శాతం పూర్తయినట్లు గడ్కరీ చెబుతున్నారు.

రూ.16 వేల కోట్ల ఖర్చు.. ఇంకా ఇబ్బందులే
ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యాయి. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, కాంట్రాక్టర్ల వైఫల్యం, పనుల నెమ్మదితనం వంటివి జాప్యానికి కారణాలుగా ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇటీవల నిర్మించిన కొన్ని రహదారి భాగాల్లో వర్షాలకు గుంతలు ఏర్పడటంతో నాణ్యతపైనా విమర్శలు వచ్చాయి. వాహనదారులు ట్రాఫిక్‌ మళ్లింపులు, నీటిముంపు, మరమ్మతులతో ఇబ్బందులు పడుతున్నారు. ఖర్ఫాడా టోల్‌ ప్లాజాలో టోల్‌ వసూలు మొదలైనప్పటికీ పలు వంతెనలు, బైపాస్‌లు ఇంకా పూర్తికాలేదు. మొత్తం పనులు పూర్తయితే ముంబై, కొంకణ్‌, గోవా మధ్య ప్రయాణం సులభం కావడంతో పాటు పర్యాటకం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది.
Advertisement
Nitin Gadkari
Mumbai Goa Highway
NH 66 expansion
Highway construction delay
Mumbai Goa road project
Road transport ministry

More Telugu News