శాసనమండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. ఎథిక్స్ కమిటీ విచారణకు ఇద్దరి నేతల వ్యవహారం
- తాతా మధు, నవీన్ రెడ్డిలను సభ నుంచి సస్పెండ్ చేసిన మండలి ఛైర్మన్
- సస్పెన్షన్ తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న బీఆర్ఎస్ సభ్యులు
- ఓటింగ్‌కు నిరాకరించిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసనమండలిలోనూ రాజకీయ సెగలు తీవ్ర స్థాయికి చేరాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను మిగిలిన సమావేశాల కాలానికి సస్పెండ్ చేయడం మండలిలో దుమారం రేపింది. మండలిలో ఈ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్ ప్రతిపాదనపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా... దానిపై ‘డివిజన్ ఓటింగ్’ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే ఓటింగ్‌కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
మరోవైపు, అసెంబ్లీ గేటు వద్ద నిరసనల సందర్భంలో శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు మహిళల ఎదుట దుస్తులు విప్పి నిరసన తెలిపారనే కారణాలతో వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీకి మండలి ఛైర్మన్ రిఫర్ చేశారు.