వందేమాతరం పూర్తి గేయం ఆలపించిన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంతరం.. కూటమి మధ్య విభేదాలు

వందేమాతరం పూర్తి గేయం ఆలపించిన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంతరం.. కూటమి మధ్య విభేదాలు

Farooq Abdullah and Omar Abdullah sing full Vande Mataram as Congress raises objections
  • శ్రీనగర్ లో తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 
  • వందేమాతరం పూర్తయ్యేంత వరకు నిలబడ్డ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా
  • మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కేసీ వేణుగోపాల్
  • మాపై మీరు షరతులు విధించలేరన్న నేషనల్ కాన్ఫరెన్స్
  • కేంద్ర హోం శాఖ నిబంధనలకు అనుగుణంగానే గేయాన్ని గౌరవించామని వెల్లడి

శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన జమ్మూకశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ‘వందేమాతరం’ పూర్తి గేయం (ఆరు చరణాలు) ఆలపించడం, ఆ సమయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాలు గౌరవ సూచకంగా పూర్తి సమయం నిలబడటం పొత్తు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ తన మిత్రపక్ష వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... స్వాతంత్ర్య సమరయోధుల ఆలోచనలు, 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం ప్రకారం ‘వందేమాతరం’ మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని సూచించారు. జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించడం భారత్ లౌకిక, సమగ్ర భావనకు విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు.


మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానీయుల నిర్ణయాలను గౌరవించి, మొదటి రెండు చరణాలకే కట్టుబడి ఉండాలని, ఈ పాటను కోరి రాజకీయం చేయకుండా లౌకికత్వాన్ని కాపాడాలని కాంగ్రెస్ తమ భాగస్వామ్య పక్షాలను కోరింది.


మరోవైపు, కేసీ వేణుగోపాల్ ట్వీట్ పై నేషనల్ కాన్ఫరెన్స్ అదే స్థాయిలో ప్రతిస్పందించింది. "ఇండియా కూటమి భాగస్వామిగా, ఎప్పుడు పాడాలి లేదా ఎంత పాడాలి అనే విషయాలపై మీరు షరతులు విధించలేరు. ట్వీట్ చేసే హక్కు వేణుగోపాల్‌కు ఉంది. కానీ ఆయన దేనినీ బలవంతంగా రుద్దలేరు. ఇది ప్రజల నిర్ణయం. ప్రజలపై దేనినీ రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాము. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు మూడు నిమిషాల పాటు సాగిన పూర్తి గేయాలాపన ముగిసే వరకు నిలబడి గౌరవించారు" అని ఎన్సీ నేత బషీర్ అహ్మద్ తెలిపారు.
Advertisement
Farooq Abdullah
Omar Abdullah
Vande Mataram controversy
Jammu and Kashmir International Film Festival
Congress National Conference rift
KC Venugopal

More Telugu News