సహచరుల ప్రాంక్‌కు గంగూలీ కంగారు.. కెప్టెన్సీ వదిలేస్తానంటూ ప్రకటన.. ఆరోజు డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది?

Sourav Ganguly panicked by teammates prank and offered to resign as captain what happened in the dressing room that day
  • యువరాజ్, హర్భజన్ చేసిన ప్రాంక్‌తో కెప్టెన్సీ వదిలేస్తానన్న గంగూలీ
  • జట్టు సభ్యులపై విమర్శలు చేసినట్లు ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్ సృష్టించిన వైనం
  • సచిన్, ద్రావిడ్ కూడా ఈ నాటకంలో పాలుపంచుకోవడంతో నమ్మేసిన దాదా 
  • ఈ డ్రామా జరుగుతుండగా మైదానంలో ఎదురుచూస్తూ ఉండిపోయిన కోచ్ జాన్ రైట్ 
  • గంగూలీ మంచి మనసున్న కెప్టెన్ అని, పెద్దన్నలా చూసుకున్నాడని గుర్తు చేసుకున్న భ‌జ్జీ
ఒక చిన్న చిలిపి ప్రాంక్.. భారత క్రికెట్ జట్టులో తీవ్ర కలకలం రేపింది. ఏకంగా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించేంత వరకు వెళ్లింది. ఈ ఆసక్తికరమైన సంఘటనను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2005లో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు కొచ్చిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్‌లో పెను నాటకీయతకు దారితీసింది.

ఏప్రిల్ 1న, అంటే ఏప్రిల్ ఫూల్స్ డే రోజున యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కలిసి కెప్టెన్ గంగూలీపై ప్రాంక్ చేయాలని నిర్ణయించుకున్నారు. జట్టు సభ్యులందరూ పార్టీలకు అలవాటు పడ్డారని, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని గంగూలీ విమర్శించినట్లు కొన్ని ఫేక్ వార్తాపత్రిక క్లిప్పింగ్స్‌ను సృష్టించారు. వాటిని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గంగూలీ వద్దకు వెళ్లారు. "దాదా.. ప్రెస్‌కు మీరు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఏంటి?" అంటూ యువరాజ్ నాటకాన్ని ప్రారంభించాడు. ఆ క్లిప్పింగ్స్ చూడగానే గంగూలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

"నేను అలా అనలేదు. ఒకవేళ అన్నట్లు నిరూపిస్తే కెప్టెన్సీ వదిలేస్తా" అని గంగూలీ చెప్పాడు. పరిస్థితి మరింత నమ్మశక్యంగా ఉండటానికి, సీనియర్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కూడా ఈ నాటకంలో భాగమయ్యారు. "నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు" అని సచిన్, ద్రావిడ్ అనడంతో గంగూలీ పూర్తిగా నమ్మేశాడు. దీంతో అత‌నిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో హర్భజన్, మరికొందరు ఆటగాళ్లు తమ కిట్ బ్యాగులు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు నడవడం ప్రారంభించారు. దీంతో కంగారుపడిన గంగూలీ.. "రేపు మ్యాచ్ ఉంది, మీరేంటి ఇలా చేస్తున్నారు?" అంటూ వారి వెంటే పరిగెత్తాడు.

ఈ నాటకం పతాకస్థాయికి చేరిన సమయంలో ఎవరో ఒకరు నవ్వడంతో అది ప్రాంక్ అని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరుగుతున్నంత సేపు, జట్టు కోచ్ జాన్ రైట్ మైదానంలో ఫీల్డింగ్ కోన్స్ ఏర్పాటు చేస్తూ ఆటగాళ్ల కోసం 20 నిమిషాలకు పైగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. 'జట్టు అంతర్గత విషయం' అని చెప్పి హర్భజన్ అత‌డిని బయటే ఉండమన్నాడు.

"గంగూలీ పెద్దన్న లాంటి వాడు కాబట్టే ఇదంతా సాధ్యమైందని, మరో కెప్టెన్ అయితే తమను కచ్చితంగా ఇంటికి పంపించేవాడని" హర్భజన్ నవ్వుతూ గుర్తుచేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం తేలికగా ఉంటేనే జట్టు విజయాలు సాధిస్తుందని భ‌జ్జీ అభిప్రాయపడ్డాడు. విశేషమేమిటంటే.. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్ 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-4 తేడాతో కోల్పోయింది.
Advertisement
Sourav Ganguly
Harbhajan Singh
Yuvraj Singh
Indian Cricket Team Prank
India vs Pakistan 2005
Cricket Dressing Room Secrets

More Telugu News