జెమినీలో ఏఐ వాటర్‌మార్క్‌కు గూగుల్ గుడ్‌బై? ఇక కనిపించకుండా చేసుకునే ఛాన్స్

Google Gemini goodbye to AI watermark chance to make it invisible
  • జెమినీలో కనిపించే ఏఐ వాటర్‌మార్క్‌ ఆప్షనల్‌
  • సెట్టింగ్స్‌లో మీడియా వాటర్‌మార్క్‌ ఆఫ్‌ చేయొచ్చు
  • కంటెంట్‌లో కొనసాగనున్న సింథ్‌ఐడీ
  • కంటెంట్‌ క్రెడెన్షియల్స్‌తో కంటెంట్‌ చరిత్ర తెలుసుకునే అవకాశం
  • చట్టాలు తప్పనిసరి చేస్తే వాటర్‌మార్క్‌
గూగుల్‌ జెమినీ వినియోగదారులకు కొత్త ఆప్షన్‌ తీసుకొచ్చింది. ఇకపై ఏఐతో రూపొందించిన ఫొటోలు, ఇతర మీడియాపై కనిపించే వాటర్‌మార్క్‌ను అవసరమైతే తొలగించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో ప్రెజెంటేషన్లు, సోషల్‌ మీడియా పోస్టులు, డిజైన్‌ పనుల కోసం ఏఐ కంటెంట్‌ను ఉపయోగించే వారికి ఫొటోపై కనిపించే గుర్తు లేకుండా క్లీన్‌ ఫైల్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏఐ కంటెంట్‌ గుర్తింపును పూర్తిగా తొలగించడం మాత్రం జరగదు.

వాటర్‌మార్క్‌ను మాత్రమే గూగుల్‌ ఆప్షనల్‌గా మార్చింది. ఏఐతో రూపొందించిన కంటెంట్‌లో సింథ్‌ఐడీ అనే కనిపించని వాటర్‌మార్క్‌ కొనసాగుతుంది. దీని ద్వారా ఆ కంటెంట్‌ను గూగుల్‌ ఏఐతో రూపొందించారా లేదా ఎడిట్‌ చేశారా అనేది గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే కంటెంట్‌ క్రెడెన్షియల్స్‌ ద్వారా కంటెంట్‌ ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో ఎలాంటి మార్పులు జరిగాయనే వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఆప్షన్‌ జెమినీ సెట్టింగ్స్‌లో మీడియా వాటర్‌మార్క్‌ పేరుతో అందుబాటులోకి వస్తోంది. జెమినీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి ఈ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. అయితే ఈ సదుపాయం అన్ని దేశాలు, అందరు వినియోగదారులకు ఒకేసారి అందుబాటులోకి రాకపోవచ్చు. స్థానిక చట్టాలు ఏఐ కంటెంట్‌పై కనిపించే గుర్తు తప్పనిసరి చేస్తే అక్కడ వాటర్‌మార్క్‌ కొనసాగుతుంది.

గూగుల్‌ ఈ మార్పును కేవలం ఫొటోలకే పరిమితం చేయకుండా ఏఐతో రూపొందించే వీడియో, మ్యూజిక్‌ వంటి ఇతర కంటెంట్‌కు కూడా విస్తరిస్తోంది. అంటే ఇకపై కంటెంట్‌పై కనిపించే ఏఐ గుర్తును తొలగించుకోవచ్చు.. కానీ కంటెంట్‌ ఏఐతో రూపొందిందనే సమాచారాన్ని గుర్తించే సాంకేతిక వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది.
Advertisement
Google Gemini
AI Watermark
SynthID
Google AI
Remove AI Watermark
Gemini Settings

More Telugu News