148 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says DSC process completed in 148 days and annual DSC to be held
  • డీఎస్సీ పరీక్షను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించామన్న లోకేశ్
  • విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడి
  • వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిందని మండిపాటు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... డీఎస్సీ నిర్వహణ, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఏకంగా 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని లోకేశ్ వివరించారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా తెలిపారు. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి దేశాలకు పంపిస్తుంటే, గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి కించపరిచిందని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వంలో వ్యవస్థను ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.


డీఎస్సీ నియామక ప్రక్రియపై న్యాయస్థానాల్లో 336 కేసులు దాఖలైన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశామని వెల్లడించారు. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కి సంబంధించి 3.68 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1.87 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారనే గణాంకాలను అసెంబ్లీ వేదికగా లోకేశ్ సమర్పించారు.

Advertisement
Nara Lokesh
AP DSC
Teacher Recruitment
Andhra Pradesh Assembly
Education Reforms
TET Results

More Telugu News