గోల్డ్ బాండ్ల పంట పండింది.. ఈసారి పెట్టుబడికి నాలుగింతల లాభం!

Sovereign Gold Bond 2019 Series III investors get massive four times profit
  • సావరీన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్‌కు భారీ రాబడి
  • రూ. 3,449 ఇష్యూ ధర కాగా.. రూ. 15,310 రిడెంప్షన్ ధర
  • ఏడేళ్ల కాలంలో పెట్టుబడిపై 344 శాతం లాభం
  • లక్ష రూపాయల పెట్టుబడిపై రూ. 4.44 లక్షల రాబడి
  • మూలధన లాభంతో పాటు 2.5% వార్షిక వడ్డీ అదనం
సావరీన్ గోల్డ్ బాండ్లలో (ఎస్జీబీ) పెట్టుబడి పెట్టిన వారికి కనకవర్షం కురిసింది. 2019 ఆగస్టు 14న జారీ చేసిన ఎస్జీబీ 2019-20 సిరీస్-3 ముందస్తు ఉపసంహరణ (ప్రీమెచ్యూర్ రిడెంప్షన్) ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఈ బాండ్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు 2026 ఆగస్టు 14 నుంచి తమ పెట్టుబడులను నగదుగా మార్చుకోవచ్చని తెలిపింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి యూనిట్‌ (గ్రాము) ఇష్యూ ధర రూ. 3,449 కాగా, ఇప్పుడు దాని రిడెంప్షన్ ధరను రూ. 15,310గా ఆర్బీఐ నిర్ణయించింది. అంటే, ఏడేళ్ల వ్యవధిలో పెట్టుబడి విలువ ఏకంగా నాలుగింతలకు పైగా పెరిగింది. ప్రతి యూనిట్‌పై నికరంగా రూ. 11,861 లాభం వచ్చినట్లు లెక్క. శాతం పరంగా చూస్తే ఇది సుమారు 343.9 శాతం రాబడితో సమానం. ఈ లాభం కేవలం బంగారం ధరల పెరుగుదల వల్ల వచ్చింది మాత్రమే. దీనికి పెట్టుబడి కాలంలో లభించిన 2.5 శాతం వార్షిక వడ్డీ అదనం.

ఉదాహరణకు, ఒక ఇన్వెస్టర్ ఆ సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే, వారికి సుమారు 28.99 యూనిట్లు కేటాయించి ఉంటారు. ప్రస్తుత రిడెంప్షన్ ధర ప్రకారం ఆ పెట్టుబడి విలువ రూ. 4.44 లక్షలకు చేరుకుంది. అంటే, వడ్డీని మినహాయిస్తేనే నికరంగా రూ. 3.44 లక్షల లాభం వచ్చినట్టు. వార్షికంగా ఇది సుమారు 23.7 శాతం రాబడితో సమానం.

సాధారణంగా ఎస్జీబీల మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు ఉంటుంది. కానీ, జారీ చేసిన ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లింపు తేదీలలో ముందస్తుగా ఉపసంహరించుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పిస్తుంది. రిడెంప్షన్ ధరను, ఉపసంహరణ తేదీకి ముందున్న మూడు పనిదినాల్లో (ఆగస్టు 11, 12, 13) 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) నిర్ణయించింది. ఈ ముందస్తు ఉపసంహరణ అవకాశం గురించి బాండ్ల జారీ సమయంలోనే పెట్టుబడిదారులకు తెలియజేశారు.
Advertisement
Sovereign Gold Bond
RBI SGB Redemption
Gold Bond Returns
SGB 2019 Series III
Gold Investment Profit
RBI Gold Bond Price

More Telugu News