నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్
- తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానన్న అనసూయ
- తాను శ్రీరాముడిని కొలుస్తానని వెల్లడి
- తన కొడుకుని హనుమంతుడి పేరు పెట్టుకున్నానన్న అనసూయ
హిందూ ధర్మం, సనాతన ధర్మంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో... సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఏ మతాన్ని కించపరచనని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని అనసూయ స్పష్టం చేసింది. తాను సనాతన ధర్మాన్ని పాటించే పక్కా హిందువునని, తన ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల తనకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొంది. తాను చెప్పిన అసలు విషయాన్ని పక్కన పెట్టి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది.
అసలు ఏం జరిగిందంటే... గతంలో ఒక సందర్భంలో అనసూయ మాట్లాడుతూ.. 'జై శ్రీరామ్' అనే నినాదం ముసుగులో కొందరు దాడులకు తెగబడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని వ్యాఖ్యానించడమే ఈ వివాదానికి కారణమైంది. సనాతన ధర్మం పేరుతో దాడులు చేయడాన్ని ప్రశ్నించిన ఆమె, తాను శ్రీరాముడినే కొలుస్తానని, ఆ భక్తితోనే తన పెద్ద కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నానని వివరించింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆమె తాజాగా ఈ వివరణ ఇచ్చింది.