Advertisement

సౌదీ అరేబియాతో అమెరికా చారిత్రక అణు ఒప్పందం.. ట్రంప్ ఆమోదముద్ర!

Donald Trump approves historic civil nuclear deal with Saudi Arabia
  • సౌదీతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందం
  • యూరేనియం శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన
  • అమెరికా కంపెనీలకు బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు
  • కాంగ్రెస్ సమీక్షకు పంపనున్న ట్రంప్ సర్కార్
  • అణు సాంకేతికత విస్తరణపై కాంగ్రెస్‌లో ఆందోళన
పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీ అరేబియాతో అత్యంత ప్రాధాన్యమున్న 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ చారిత్రక ఒప్పందం ద్వారా సౌదీ అరేబియా భూభాగంలోనే యూరేనియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. వాషింగ్టన్, రియాద్‌ సంయుక్తంగా నిర్వహించే అధ్యయనంలో సాధ్యమేనని తేలితే, అమెరికన్ కంపెనీలు ఈ శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తాయి. తద్వారా విదేశీ పోటీదారులను పక్కనపెట్టి, సౌదీ అణు మౌలిక సదుపాయాల నిర్మాణంలో అమెరికా సంస్థలు పదిలమైన స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా వేల కోట్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలను పొందుతాయి.

పౌర అణు రియాక్టర్లకు ఇంధనాన్ని అందించే యూరేనియం శుద్ధి సాంకేతికతను అధిక స్థాయికి తీసుకెళ్తే అణ్వాయుధాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. అయితే, అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం వల్ల సౌదీ అణు రంగంపై తమకు పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, సైనిక అవసరాలకు మళ్లకుండా అడ్డుకోవచ్చని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఏప్రిల్ 2025 పర్యటనలో ప్రాథమిక చర్చలు జరిపిన యుఎస్ ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, విద్యుత్ అవసరాలు తీర్చుకోవాలని భావిస్తున్న సౌదీ ప్రయత్నాలకు ఇది దోహదపడనుంది. అయితే, ఈ ఒప్పందాన్ని సమీక్ష కోసం త్వరలోనే యుఎస్ కాంగ్రెస్‌కు పంపనుండటంతో, పశ్చిమాసియాలో అణు పరిజ్ఞానం విస్తరణపై ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.
Advertisement
Donald Trump
Saudi Arabia
US Saudi Nuclear Deal
Uranium Enrichment
Civil Nuclear Agreement
Middle East Geopolitics

More Telugu News