Advertisement

‘అతను నా డ్రైవర్‌ కాదు.. నా కొలీగ్‌’.. ఒక్క మాటతో హృదయాలను గెలిచిన యజమాని

He is not my driver he is my colleague owner wins hearts with one word
  • ఓ డ్రైవర్‌కు అవసరమైన బైపాస్‌ సర్జరీ
  • రూ.4.25 లక్షలు చెల్లించిన యాజమాని
  • ఆపరేషన్‌ విజయవంతమైందని డాక్టర్‌ సమాచారం
  • ‘డ్రైవర్‌ కాదు.. నా కొలీగ్‌’ అన్న యజమాని
  • 15 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నామని వ్యాఖ్య
  • యజమాని మాటలకు డాక్టర్‌ భావోద్వేగం
కొన్నిసార్లు ఒక్క మాటే మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. డబ్బు కంటే విలువైనది గౌరవమని, ఉద్యోగం కంటే గొప్పది మానవత్వమని నిరూపించిన ఓ యజమాని కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వేలాది మంది హృదయాలను హత్తుకుంటోంది.

డాక్టర్‌ ప్రశాంత్‌ మిశ్రా వద్దకు ఓ డ్రైవర్‌ బైపాస్‌ సర్జరీ కోసం వచ్చాడు. తాను పనిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌కు సుమారు రూ.4.25 లక్షలు ఖర్చవుతుందని, ప్రభుత్వ పథకం ద్వారా మున్సిపల్‌ ఆసుపత్రిలో ఉచితంగా చేయించుకోవచ్చని డాక్టర్‌ సూచించారు.

అయితే అదే రోజు సాయంత్రం రోగి కుమారుడు ఫోన్‌ చేసి.. తమ తండ్రికి అదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాలని, వీలైనంత వరకు ఖర్చు తగ్గించేందుకు సహకరించాలని కోరాడు. దీనికి డాక్టర్‌ కూడా అంగీకరించారు.

మరుసటి రోజే ఆ డ్రైవర్‌ యజమాని ఆపరేషన్‌కు అవసరమైన మొత్తాన్ని ఆర్టీజీఎస్‌ ద్వారా నేరుగా ఆసుపత్రి ఖాతాలో జమ చేశారు. అనంతరం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో డాక్టర్‌ ఆయనకు ఫోన్‌ చేసి.. ‘‘మీ సాయానికి ధన్యవాదాలు. శ్రీ శుక్లా ఆపరేషన్‌ విజయవంతమైంది’’ అని చెప్పారు.

దానికి అవతలి వ్యక్తి.. ‘‘ధన్యవాదాలు డాక్టర్‌. నా కొలీగ్‌ను ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు’’ అని సమాధానమిచ్చారు. ఆ మాట విని ఆశ్చర్యపోయిన డాక్టర్‌.. ‘‘కొలీగా? ఆయన మీ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తారని చెప్పారు కదా!’’ అని అడిగారు.

అందుకు యజమాని ఎంతో హుందాగా స్పందిస్తూ.. ‘‘ఆయన గత 15 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్నారు. నేను ఒక పని చేస్తాను.. ఆయన మరో పని చేస్తారు. మా బాధ్యతలు వేరు.. కానీ మేం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. అందుకే ఆయన్ను నేను డ్రైవర్‌గా కాదు.. నా సహోద్యోగిగా చూస్తాను’’ అని చెప్పారు.

ఆ సమాధానం విన్న తర్వాత తనకు మాటరాలేదని డాక్టర్‌ ప్రశాంత్‌ మిశ్రా తెలిపారు. ఈ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆయన.. ఇంట్లో, ఆఫీసులో పనిచేసే వారిని కేవలం పనివాళ్లుగా చూడొద్దని, మన జీవితం సాఫీగా సాగేందుకు వారు కూడా కీలక పాత్ర పోషిస్తారని, ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, ఆత్మగౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.

ఈ పోస్టుపై నెటిజన్లు కూడా భావోద్వేగంగా స్పందించారు. తమ ఇంట్లో పనిచేసే వారికి పదవీ విరమణ తర్వాత ఉపయోగపడేలా ఎస్‌ఐపీ చేస్తున్నానని ఓ వ్యక్తి వెల్లడించారు. మరికొందరు ‘‘ఉద్యోగం కాదు.. మనిషే ముఖ్యం’’, ‘‘కొంచెం గౌరవం, కృతజ్ఞత, దయ ఉంటే ప్రపంచం మరింత అందంగా ఉంటుంది’’ అంటూ స్పందించారు.
Advertisement
Dr Prashant Mishra
Driver Heart Surgery
Kind Employer Story
Social Media Viral
Employee Respect News
Bypass Surgery Cost

More Telugu News