Advertisement

మంత్రి రాజీనామాతో ప్రభుత్వమే బలపడుతుంది: ప్రధానికి అన్నా హజారే లేఖ

Anna Hazare urges PM Modi to address NEET paper leak and student issues
  • మంత్రి రాజీనామాతో ప్రభుత్వానికి బలం వస్తుందన్న హజారే
  • నీట్‌ లీక్‌లపై బాధ్యత వహించాలని సూచన
  • సోనమ్‌ వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని విజ్ఞప్తి
  • విద్యార్థుల సమస్యలను బలప్రయోగంతో అణచొద్దని హితవు
  • యువత ఆందోళనలను ప్రభుత్వం వినాలని సూచన
  • ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలు పరిష్కరించాలని విన్నపం
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచాలని ఆయన కోరారు. నీట్‌ పరీక్షల పేపర్‌ లీక్‌లు, విద్యార్థుల సమస్యలపై యువతతో పాటు పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని సూచించారు. 

మంత్రి రాజీనామా చేస్తే ప్రభుత్వం బలహీనపడదని, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నా హజారే స్పష్టం చేశారు. శాఖల్లో వైఫల్యాలకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటే, మిగతా మంత్రులకు కూడా స్పష్టమైన సందేశం వెళుతుందని అన్నారు. దీంతో ప్రభుత్వ పనితీరు మరింత బాధ్యతాయుతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా కుంభకోణాలు జరిగితే కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకుంటారని గుర్తుచేశారు. కానీ శాఖల వైఫల్యాలకు తుది బాధ్యత ఉన్నత నాయకత్వానిదేనని పేర్కొన్నారు.

2024లో నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ ఆరోపణలు ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమై దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల రద్దు, రీ-ఎగ్జామ్‌ల అనిశ్చితి కారణంగా పలువురు విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. మీడియా కథనాల ప్రకారం 22 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఉద్యోగ నియామకాల జాప్యం, ప్రశ్నపత్రాల లీకులు, నిరుద్యోగం వంటి అంశాలతో యువత ఆందోళనలో ఉందని, వీటిని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడకూడదని హజారే సూచించారు.

ఢిల్లీలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన దీక్షపై పోలీసుల చర్యలు, ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి తరలించడం బాధాకరమని హజారే అన్నారు. బలప్రయోగానికి బదులుగా ప్రభుత్వ ప్రతినిధులను పంపించి చర్చలు జరపాల్సిందని సూచించారు. ప్రజాస్వామ్య, గాంధేయ స్ఫూర్తిని పాటిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను ఓపిగ్గా విని, పరస్పర విశ్వాసంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Anna Hazare
PM Narendra Modi
NEET paper leak 2024
Sonam Wangchuk protest
Education Minister resignation
Student unemployment issues

More Telugu News