వరుసగా విఫలం కావడంపై అభిషేక్ శర్మ స్పందన
- టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడుసార్లు డకౌటైన అభిషేక్ శర్మ
- తన దూకుడైన ఆటతీరును ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోనని వెల్లడి
- రెండేళ్ల క్రితమే ఒత్తిడి తీసుకోవడం మానేశానన్న అభిషేక్
ప్రస్తుత టోర్నీలో యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అభిషేక్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, జట్టు యాజమాన్యంతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి పూర్తి మద్దతు ప్రకటించారు. అభిషేక్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతడు కచ్చితంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ అభిషేక్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘బ్యాటింగ్‌ను నేను చాలా ఆస్వాదిస్తాను. ఒత్తిడికి గురికావడాన్ని రెండేళ్ల క్రితమే వదిలేశాను. నా చేతుల్లో ఉన్నది కేవలం సాధన చేయడమే. నా ఆటతీరు, మైండ్‌సెట్‌ను మార్చుకోను. ప్రతి బ్యాటర్ కెరీర్‌లో ఇలాంటి ఒడిదొడుకులు సహజం. ఫలితాలు ఎలా ఉన్నా దూకుడుగా ఆడటమే నా శైలి’ అని తేల్చిచెప్పాడు. కాగా, ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.