నన్ను కలుసుకోవడానికి పాదయాత్ర చేయకండి: అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం
- అభిమానుల కోసం ప్రకటన విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్
- త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఎన్టీఆర్
- అందరూ ఓపికగా ఉండాలని విజ్ఞప్తి చేసిన ఎన్టీఆర్
కొంతమంది అభిమానులు ఆయనను కలుసుకోవడానికి పాదయాత్రతో హైదరాబాద్‌కు వస్తున్న విషయం ఎన్టీఆర్‌కు తెలిసింది. దీంతో ఆయన త్వరలోనే అభిమానులను కలుస్తానని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
"నాపై మీరు చూపిస్తున్న ఆత్మీయత, ప్రేమ, గౌరవానికి నా కృతజ్ఞతలు. నన్ను కలుసుకోవాలని మీరు చూపిస్తున్న ఆసక్తిని, అభిమానాన్ని నేను అర్థం చేసుకున్నాను. దీనికి సంబంధించి త్వరలోనే మీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ సమావేశానికి సంబంధించిన అనుమతులు, పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుని, శాంతి భద్రతలకు ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించాలంటే కొంత సమయం పడుతుంది. కావున అభిమానులందరూ ఓపికగా ఉండాలని కోరుతున్నాను. అంతేకాదు, నన్ను కలుసుకోవడానికి పాదయాత్రలు చేయకండి. మీ ఆనందంతో పాటు మీ సంక్షేమం కూడా నాకు చాలా ముఖ్యం" అని ఎన్టీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.