ఆర్యలో హీరోగా బన్నీ అలా సెట్ అయ్యాడు: సుకుమార్
- తొలుత కొత్త హీరోతో ఆర్య తీద్దామని అనుకున్నానన్న సుకుమార్
- ఆ క్షణంలో బన్నీలో ఆర్య కనిపించాడని వెల్లడి
- తొలుత వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్లే బన్నీ ఆర్యకు కరెక్ట్‌గా సరిపోతాడని చెప్పారన్న సుకుమార్
తాను 'దిల్' సినిమాకు పని చేస్తున్న సమయంలోనే విశాఖలో చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడు తాను రాసిన కథలోని కొన్ని సన్నివేశాలు, మాంటేజ్ షాట్స్ దిల్ రాజుకు చెబుతుండేవాడినని, అవి ఆయనకు బాగా నచ్చి దిల్ సినిమా హిట్టయితే దర్శకత్వం ఛాన్స్ ఇస్తానని చెప్పేవాడని సుకుమార్ తెలిపారు. దిల్ మూవీ గొప్ప హిట్ కావడంతో తనకు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని పిలిపించి ఓ రీమేక్ సినిమా చెయ్యమని దిల్ రాజు అడిగాడని, అయితే తాను నిర్మొహమాటంగా చేయనని చెప్పేశానన్నారు. సరే కథ చెప్పమని అనడంతో తాను చెప్పగా, చాలా ఆసక్తిగా దిల్ రాజు కథ విన్నారని, కొంత సమయం ఆలోచించి ఓకే చెప్పారన్నారు.
ఇక అప్పటి నుండి హీరో వేటలో ఉన్నానని, తన మనసులో మాత్రం కొత్తవారితో చేద్దామని ఉండేదన్నారు. ఒకసారి నేను అల్లు అర్జున్ పేరు చెప్పగా అందరూ నవ్వేశారన్నారు. ఆ సమయంలో దిల్ ప్రివ్యూ వేస్తే అల్లు అర్జున్ వచ్చారని, బన్నీ అందరినీ ఎంతో హుషారుగా పలకరిస్తూ హడావుడి చేశాడన్నారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ కౌగిలించుకుంటున్నాడు. ఆ క్షణంలో తనకు బన్నీలో ఆర్య కనిపించాడని, అప్పటి వరకూ తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన స్నేహితులు కూడా బన్నీకి ఓటేశారన్నారు. 'మన ఆర్యకు బన్నీ కరెక్ట్‌గా సరిపోతాడు' అని అన్నారని, ఆ తర్వాత మూడు నెలలు ఆడిషన్ చేసి మరీ ఆర్య చిత్ర నిర్మాణం మొదలు పెట్టామని సుకుమార్ చెప్పుకొచ్చారు.