BCCI: గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్!
- ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు నగదు ప్రోత్సాహకం
- ఈ 10 మైదానాల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ తలో రూ. 25 లక్షల నజరానా
- అలాగే మూడు అదనపు వేదికల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు తలో రూ. 10 లక్షలు
ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ తలో రూ. 25 లక్షల నజరానా ప్రకటించింది. అలాగే అదనపు వేదికల్లోని (ధర్మశాల, విశాఖపట్నం, గువాహటి) గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు తలో రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతంగా ముగియడంలో వీరు కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఇలా నగదు నజరానా ప్రకటించినట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తం 13 వేదికల్లో నిర్వహించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ అదనపు హోం గ్రౌండ్స్‌లో (ధర్మశాల, విశాఖపట్నం, గువాహటి) మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే. ఇందులో డీసీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంతో పాటు వైజాగ్‌లో కొన్ని మ్యాచులు ఆడింది. అలాగే పీబీకేఎస్ టీమ్ ముల్లాన్‌పూర్, ధర్మశాల వేదికల్లో మ్యాచులు ఆడితే.. ఆర్ఆర్ జైపూర్‌తో పాటు గువాహటిని తన హోంగ్రౌండ్‌గా ఎంచుకుంది.